రెండుగా టాలీవుడ్..... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెండుగా టాలీవుడ్.....

హైద్రాబాద్, ఆగస్టు 14  (way2newstv.com)
సినీ పరిశ్రమలో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరు. ఎప్పుడు ఎవ్వరు ఎటువైపు మారిపోతారో చెప్పడం కష్టం. ఈ వ్యాఖ్యలు రాజకీయాలకు కదా వాడేది అనే సందేహాలు వస్తున్నాయి కదూ. అవును రాజకీయాలతో పాటు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమకు కూడా వర్తిస్తున్నాయి. పరిశ్రమలో నటీనటులు కూడా రాజకీయ పార్టీలను తమకు అనుగుణంగా మార్చేసుకుంటున్నారు. లేదా తమకు అనుకూలమైన పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇక్కడ స్నేహం, సెంటిమెంట్, బందుత్వం, వావి వరసలకు తావు లేకుండా తాము అనుకున్న పనిని అనుకున్న తడవుగా చేసేసుకుంటూ వెళ్లిపోతున్నారు. 
రెండుగా టాలీవుడ్.....
ఈ దశలో ఐకమత్యంతో ముందుకు వెళ్తున్న పరిశ్రమ ఎక్కడ ముక్కలవుతుందోననే ఆందోళన మరికొంత మంది సిని పెద్దల నుంచి వ్యక్తం అవుతోంది.తెలుగు రాజకీయాలు టాలీవుడ్ చుట్టూ తిరుగుతున్నాయా. సినీ పరిశ్రమ మూడు ముక్కలు కాబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనికి మరింత బలాన్నిచ్చేలా జరుగుతున్న సంఘటనలు నిజమనే భావనను కలిగిస్తున్నాయి. మా అసోసియేషన్ ఎన్నికల్లో మొదలైన రచ్చ క్రమంగా ఏపీ ఎన్నికల వరకూ సాగింది. తెలుగు సినీ నటీనటులు.. తమకు నచ్చిన పార్టీలోకి చేరి ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేంత వరకూ చేరిందనే చెప్పాలి. అప్పటి వరకూ ప్రాణస్నేహితులుగా మెలిగిన పవన్ వర్సెస్ అలీ కూడా రాజకీయ ప్రచారంలో దుమ్మెత్తిపోసుకోకపోయినా.. అంతవరకూ వచ్చారు. శాశ్వత శత్రువులుగా మారేంత వరకూ చేరారు.బండ్ల గణేశ్ అయితే తాను కాంగ్రెస్ ఓడితే గొంతు కోసుకుంటానంటూ బ్లేడ్ అడిగి.. బ్లేడ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. నరేశ్, శివాజీరాజా వంటి నటులు బహిరంగంగా మీడియా సమావేశాల్లో విమర్శలు కురిపించుకున్నారు. తాజాగా.. దర్శకులు కె.విశ్వనాథ్ ను తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కలవటం.. ఆయనతో సినిమా నిర్మించేందుకు సిద్ధమంటూ చెప్పటం కూడా చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి సినీవర్గాలను చంద్రశేఖర్ రావు విమర్శిస్తుంటారు. అందులోనూ ఏపీ నటులను మరింతగా ద్వేషించేవారు. పవన్, చిరంజీవి తాము అభిమానిస్తామంటూనే కేటీఆర్, కవిత ఇద్దరూ సమయం చిక్కినప్పుడు విమర్శలు కురిపించేవారు.ఏపీలో వైసీపీ గెలిచిన తరువాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కమెడియన్లుగా తెలుగు సినిమాలో అభిమానులు సంపాదించుకున్న అలీ, ప్రుద్వీరాజ్ వంటి వారి మధ్య రచ్చకు కారణమైంది. ప్రుద్వీరాజ్ తాజాగా చిరంజీవి సైరా లో నటించాడు. కానీ వైసీపీ తరపున ప్రచారం.. ఆ తరువాత జగన్ సీఎం కావటంతో అది తారాస్థాయికి చేరింది. చివరకు ప్రుద్వీకు నాలుగు సినిమాల నుంచి తొలగించారు. తానే స్వయంగా విషయాన్ని బయటపెట్టారు. తన మేనేజర్ తో వారి డబ్బులను వెనక్కి పంపినట్టుగా కూడా చెప్పాడు. జగన్ సీఎం కావటం సినీమా పెద్దలకు ఇష్టం లేదంటూ మరో బాంబు పేల్చాడు. దీనికి ఎవ్వరూ కౌంటర్ ఇవ్వకపోయినా తిరుమల దర్శనానికి వెళ్లిన రాజేంద్రప్రసాద్ మాత్రం.. సీఎంను కలవాల్సిన అవసరం కళాకారులకు ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఆయన పాలనలో బిజీగా ఉంటారని.. కాస్త సమయం చిక్కాక వెళ్లి కలసి అభినందనలు చెబుతామంటూ తన వ్యక్తిగత అభిప్రాయం వెలిబుచ్చారు.దీనిపై ప్రుద్వీ కూడా మరో కౌంటర్ ఇచ్చాడు. ఇదంతా ఒట్టి బూటకపు మాటలుగా కొట్టిపారేశారు. ఇక్కడ తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూడా మొన్న హరిక్రిష్ణ మరణం అపుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. స్మారకచిహ్నం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. విశ్వనాథ్ ను ఇంత అకస్మాత్తుగా ఎందుకు చూడాల్సి వచ్చిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. విశ్వనాథ్ మాత్రం.. కుచేలుడి ఇంటికి వేణుగోపాలుడు వచ్చాడనేంత ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. పోనీ పరామర్శించేందుకు వచ్చారా అంటే.. అబ్బే నాకేమైంది.. బేషుగ్గా ఉన్నానంటూ చెప్పేశారు. మరి చంద్రశేఖర్ రావు కు ఇంత అకస్మాత్తుగా విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలనే కోరిక ఎందుకు పుట్టిందో, గులాబీ బాస్ మాత్రమే చెప్పాలి.