నరకానికి నకలుగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నరకానికి నకలుగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి

రోగులకు అందుబాటులో లేని వైద్యులు, నర్సులు
 ఒక బెడ్ పై ఇద్దరు, ముగ్గురు రోగులు
 మంచిర్యాల ఆసుపత్రిని పరిశీలించి మీడియాతో మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు
మంచిర్యాల, ఆగష్టు 27  (way2newstv.com)
మంచిర్యా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నరకానికి నకలుగా మారిందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఉదయం మాజీ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం భట్టి విక్రమార్క కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంచుర్యాల జిల్లా ఆసుపత్రి నరకానికి నమూనాగా మారిందని అన్నారు. ఇక్కడకు రోగంతో వచ్చే వారికి, వారికి తోడుగా వచ్చేవారికి కొత్త రోగాలు అంటుకునెలా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. 
నరకానికి నకలుగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి

బెడ్లు దమ్ముకొట్టుకొని, మట్టితో కూడుకుని వాటిపై రోగులు అత్యంత దయనీయంగా ఉన్నారని భట్టి చెప్పారు. ఆపరేషన్ థియేటర్లో పెచ్చులు ఊడి, వర్షపు నీరు కారేపరిస్తితి ఉందని అన్నారు. బాత్రూం మొదలు ఎక్కడా రన్నింగ్ వాటర్ లేవని చెప్పారు. తాగునీటి వసతి కూడా ఎక్కడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ మొత్తం బ్లాకై.. వాటిని శుభ్రం చేసి పరిస్థితి ఏమాత్రం లేదని చెప్పారు. ఆసుపత్రి గదులు, పేషంట్స్ వార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఆయన అన్నారు.  దీనిని చూస్తే జిల్లా ప్రధాన ఆసుపత్రి అనేలా ఏమాత్రం లేదని అన్నారు. జిల్లాప్రధాన ఆసుపత్రిగా ఉన్న ఇందులో పడకలు లేవు.. ఉన్నవాటికి అనుగుణంగా బెడ్ షీట్స్ లేవు.. వంద పడకల ఆసుపత్రి అనేలా ఒక్క సౌకర్యం ఇక్కడ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇక్కడ వెయ్యి బెడ్ షీట్లు అవసరం ఉంటే.. 250కు మించి లేవని.. అందులో పనికివచ్చే వాటి లెక్క అందుబాటులో లేదని అన్నారు.  విపరీతమైన విష జ్వరాలతో చికిత్స కోసం వచ్చే రోగులకు ఎలాంటి సదుపాయాలు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, పేదలు, బడుగు-బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉన్నారని అన్నారు. వారికి నాణ్యమైన మంచి వైద్యం అందించాలన్న తాపత్రయంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరోగ్యశ్రీని తీసుకువచ్చిందని.. ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఆరోగ్యశ్రీని నిలిపివేసందని అన్నారు. దీనితో పేద ప్రజలు వైద్యం కోసం నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిగా ఉన్న ఇందులో వైద్యులు ఉండాల్సిన స్థాయిలో లేరని విక్రమార్క అన్నారు. గైనకాలజీ కోసం జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు, ఇతర సమస్యలతో వచ్చే మహిళలకు అందుబాటులో ఇక్కడ ఉండాల్సిన గైనకాలజీ స్పెషలిస్టులు లేరని అన్నారు. అలాగే విషజ్వరాలు చూసే ప్రత్యేక డాక్టర్లు ఎవరూ లేరని అన్నారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 66 మంది వైద్యులు ఉండాల్సిఉండగా.. కేవలం 20-25 డాక్టర్లు ఉన్నారని చెప్పారు. అలాగే 74 మంది నర్సులు ఉండాల్సిఉండగా.. 24 మంది ఉంటారని అధికారులు చెబుతున్నారని అన్నారు.  ఈ ఆసుపత్రిలో కనీసం నాలుగు వెంటిలేటర్లు ఉండాల్సిఉండగా.. ఒక్కటికూడా లేదని సీఎల్పీ భట్టి చెప్పారు. పెద్దవాళ్ళ విషయం పక్కన బెడితే.. కనీసం చిన్న పిల్లల ఆరోగ్యంపై కూడా శ్రద్ద లేకపోవడం దారుణమని అన్నారు. ఆసిఫాబాద్ లోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుకుని శ్రీలత అనే అమ్మాయికి జ్వరం వస్తే.. ఒక ఏఎన్ఏం ఇక్కడ చేర్చారని అన్నారు. అమ్మాయికి కనీసం బెడ్ లేక.. విజిటర్లు కూర్చునే కుర్చీలపై పడుకోబెట్టి సెలైన్ బాటిల్స్ పెట్టి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని అన్నారు. బాలింతలు, చిన్నపిల్లల వార్డులో ఇంతకంటే దయనీయంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.  జిల్లా ఆస్పత్రిగా.. రోజూ పెద్దఎత్తున రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో బ్లడ్ బాంక్ లేకపోవడంపై భట్టి విక్రమార్క ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల సంక్షేమం గురించి పాలకులకు ఏమాత్రం పట్టడం లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి అని అన్నారు. కనీస వసతులు లేని ఇటువంటి ఆసువుత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా చేరి చికిత్స చేయి చేయించుకుంటారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో భయంకరంగా పరిస్థితులు ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని అన్నారు.