వానలతో రోగాలతో బారిన ప్రజలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వానలతో రోగాలతో బారిన ప్రజలు

హైద్రాబాద్, ఆగస్టు 6, (way2newstv.com)
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. జూలై మూడవ వారం వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదు రోజులుగా నగరంపై మేఘాలు కమ్ముకొని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండల నుంచి తప్పించుకున్నాము అనుకునేలోపే వర్షాల సీజన్‌లో ప్రబలే వ్యాధులు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 
వానలతో రోగాలతో బారిన ప్రజలు

తడిసిన వ్యర్థాలతో పాటు వివిధ ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలతో నగరవ్యాప్తంగా దుర్గంధం వెదజల్లుతుంది. మహానగర పాలక సంస్థ స్వచ్ఛతపై విస్తృత అవగాహన కలిగిస్తున్నా చాలా ప్రాంతాల్లో స్థానికులు, వ్యాపారులు వ్యర్థాలను ఇష్టారాజ్యంగా రోడ్లపై పడవేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర అపరిశుభ్రత నెలకొంటుంది. దీనికి తోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. వర్షాకాల ప్రత్యేక బృందాలు ఉన్నప్పటికీ అవి కేవలం రోడ్లపై నీరు నిలిచిపోకుండా, వృక్షాల వంటివి నెలకూలితే తొలగించడం వంటి వాటికే పరిమితం అవుతున్నారు. చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభావం చూపుతుంది. దీనికి చల్లటి వాతావరణం తోడవడంతో ఈగలు, దోమలు, వ్యాధులకు కారణమై బాక్టీరియా పెరిగి నగర ప్రజలు జ్వరం, అతిసార వ్యాధులకు గురవుతున్నారు. చెత్తాచెదారం అధికంగా పొగయ్యే బస్తీలలో ఈ ప్రభావం అధికంగా ఉండగా, కాలనీల్లో నివసించేవారు సైతం అనారోగ్యాలతో బాధ పడుతున్నారు. ఐదేళ్లలోపు ఉండే చిన్నారులపై బాక్టీరియా ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈ వయస్సులోపు ఉన్న చిన్నారులంతా పడక దిగని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు సైతం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తూ వ్యాధులు ప్రబలకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.