ప్రకాశంలో టీఢీపీ వర్సెస్ వైసీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకాశంలో టీఢీపీ వర్సెస్ వైసీపీ

ఒంగోలు, ఆగస్టు 30, (way2newstv.com)
ఆ ఇద్దరూ బలమైన రాజకీయ కుటుంబ వారసత్వం ఉన్నవారే. ఒకరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దగ్గరివారైతే...మరొకరు మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహితులు. దీనికితోడు ఇద్దరూ వైసీపీ, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. వారే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, దామచర్ల జనార్దన్ రావు. ఎన్నికల్లో దామచర్ల ఓటమి భారంతో పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాగా, బాలినేని మంత్రిగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ కార్యకర్తలు, టీడీపీ వారిపై దాడులు చేయడంతో వివాదం రోజు రోజుకీ రాజకీయ రంగు పులుముకుంటోంది.అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇద్దరూ మీడియా సాక్షిగా సై అంటే సై అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకూ ద్వితియ శ్రేణి నాయకుల మధ్య చిన్నపాటి గొడవలు కాస్తా ముదిరి ఇప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్థన్‌గా మారుతున్నాయి. 
ప్రకాశంలో టీఢీపీ వర్సెస్ వైసీపీ

ఇద్దరూ వైసీపీ, టీడీపీ పార్టీల జిల్లా అధ్యక్షులు కావడంతో రెండు పార్టీల నాయకుల్లోనూ ఇది చర్చకు దారితీస్తోంది.నాలుగు రోజుల క్రితం టీడీపీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వర్రావు తనపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనివెనుక మంత్రి బాలినేని కుమారుడు ప్రనీత్ రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్థన్ సైతం నేరుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి పైనే ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడు టీడీపీ కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని.. కేసులకు భయపడొద్దని భరోసా ఇస్తున్నారని దామచర్ల విమర్శించారు. ఇదే విధంగా వైసీపీ నేతల దాడులు కొనసాగితే... ఇక చూస్తూ ఊరుకునే అవకాశం లేదని.. తాను కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తోందని మంత్రి బాలినేనికి రాజకీయ సవాల్ విసిరారు.టీడీపీ హయాంలో వేసిన రోడ్లు పగలగొడుతున్నారని, శిలా ఫలకాలు ధ్వంసం చేస్తున్నారని ఆయన వైసీపీపై మండిపడితున్నారు.వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు వెంకట్రావు దామాచర్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో కమ్మపాలెంలో వైసీపీ పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, టీడీపీ వల్లే కానిస్టేబుల్ తల పగలగొట్టి వైసీపీ వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన సంగతిని మర్చిపోయారా అని విమర్శించారు. మంత్రి కుమారుడు ప్రనీత్ రెడ్డి ని టార్గెట్ చేయడం మానుకోవాలని లేకపోతే తగిన విధంగా బుద్ధి చెప్తామన్నారు. మంత్రి బాలినేని మాత్రం టీడీపీ విమర్శలు పట్టించికోవడం లేదు. చూడాలి.. ముందు ముందు ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో..!