గుంటూరు, ఆగస్టు 27, (way2newstv.com)
వరుణుడి కరుణతో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి నీరు వస్తుంది. సాగర్ కు వరద నీటి ప్రవాహం పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. కుడి కాలువకు సాగు నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు నిర్ణయించారు.. రైతులు వరి పంట వేసుకునేందుకు ఈ సందర్భంగా అనుమతి ఇచ్చారు. సాగు నీటి ప్రణాళికను రూపొందించాలని నీటి పారుదల శాఖకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి.వరి సాగుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయటంతో ఆయకట్టు అన్నదాతల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణమ్మ పరవళ్ళతో సాగు నీటి కష్టాలు తీరినట్లే
కుడి కాలువ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.16 లక్షల ఎకరాల మెట్ట, మాగాణి భూములకు నీటిని సరఫరా చేయాలంటే 132 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు లింగంగుంట్ల సర్కిల్ నీటి పారుదల శాఖ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆయకట్టులో వరి సాగుకు మూడేళ్ళ అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయకట్టు అన్నదాత లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వరి సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద సాగర్ ఆయకట్టులో ఈ సారి వరి సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనటంతో వ్యవసాయ కార్మికులకు చేతినిండా పని దొరకనుంది. కూలీలు పట్టణాలకు వలస వెళ్ళే పరిస్థితులు తొలగిపోనున్నాయి. దాదాపు మూడు లక్షల ఎకరాలలో వరి సాగు అవుతుందని అంచనా. ఐతే మాగాణి భూముల్లో కూడా కంది, మినుము, పెసర తదితర పంటలను వేలాది ఎకరాలలో రైతులు సాగు చేశారు. నెల రోజుల క్రితం సాగు చేసిన పంటను తొలగించి వరి సాగు చేసేందుకు రైతులు సిద్దమవుతున్నారు. మూడేళ్ళ అనంతరం ఆయకట్టు భూముల్లో సాగు సందడి నెలకొంటోంది.