నిజామాబాద్, ఆగస్టు 06(way2newstv.com):
వర్షాలు పడుతున్నాయని సంబర పడుతున్న వేళ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాగు పెరుగుతున్న కొద్దీ ఎరువుల అవసరం ఉంటుందని తెలిసినా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ పనులు ఊపందుకొనే సమయంలో ఉభయ జిల్లాల రైతులు యూరియా అందుబాటులో లేక ఆందోళన చెందుతున్నారు. వారం రోజులు దాటినా ఎరువు జాడ కనిపించడం లేదు. సీజన్‌లో ముందుగానే ప్రణాళిక ప్రకారం రప్పించుకోవాల్సిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల దయకు ఎదురుచూడటం తప్పా ఏమీ చేయడం లేదు.వరుస వర్షాలతో ఆశాజనంగా ఉన్న మొక్కజొన్న, పసుపు, సోయాబీన్ ముందుగా నాటిన వరి పంటలకు పైపాటుగా యూరియా చాలా అవసరం.
అన్నదాత దైన్యం (నిజామాబాద్)
అయిదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చినుకులతో సాగు వేగం పెరిగింది. ఒక్కసారిగా లక్ష ఎకరాలకు పైగా పంట సేద్యంలోకి రావడంతో సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న నిల్వలు ఖాళీ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో వారం క్రితం యూరియా ప్రైవేటు డీలర్ల వద్ద 2,360 మెట్రిక్ టన్నులు, సంఘాల్లో 5,885.67 మెట్రిక్ టన్నులు ఉండగా.. అన్నీ అమ్ముడుపోయాయి. కలుపు తీయగానే కచ్చితంగా పంటకు యూరియా వేయకపోతే ఎదుగుదల ఉండదు. ఇదే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఉభయ జిల్లాల్లో సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు భారీగా నిల్వ చేసుకొని పెట్టుకున్నారు. మార్క్‌ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ ప్రస్తుతం 11,311 మెట్రిక్ టన్నులు ఉంది. దీన్ని అవసరానికి వినియోగించకుండా గోదాముల్లోనే నిల్వ ఉంచుతున్నారనే విమర్శలున్నాయి. ఎరువుల వ్యాగన్ ఒకటి, రెండు రోజుల్లో రానుందని, నేరుగా సరఫరా చేస్తే హమాలీ ఛార్జీలు కలిసొస్తాయనే చిరుఆశను ప్రదర్శిస్తున్నారు. కొన్ని సహకార సంఘాలు ఎరువులు విక్రయించిన డబ్బులను ఎప్పటికప్పుడు సంబంధిత కంపెనీలకు కట్టడం లేదు. ఈ నేపథ్యంలో వాటికి మార్క్‌ఫెడ్ అంతంతమాత్రంగానే నిల్వలు సరఫరా చేస్తోంది. సహకార సంఘాలకు అవసరమైంత ఇచ్చిన తర్వాతే ప్రైవేటు డీలర్లకు కేటాయింపులుంటాయి. ఇక్కడ సరకు తక్కువగా ఉండటంతో ప్రధాన పంపిణీదారులు తమకు కేటాయించిన సరకును నేరుగా అమ్ముకొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో యూరియా కొరత కనిపిస్తోంది.
Tags:
telangananews