విజయవాడ, ఆగస్టు 29, (way2newstv.com)
అవును! జగన్ మంత్రివర్గంలో చాలా మంది మంత్రులు… ముఖ్యంగా డిప్యూటీ సీఎంలుగా ఉన్న వారు కూడా భయపడుతున్నారనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. ఈ విషయాన్ని సీఎంవో వర్గాలే మీడియాకు చెబుతుండడం గమనార్హం. నిజానికి వైసీపీలో స్వతంత్రం లేదని, జగన్ ఎంత చెబితే అంతేనని గతంలోనూ వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పార్టీలో చేరి బయటకు వచ్చిన మైసూరా రెడ్డి, జ్యోతుల నెహ్రూ వంటి కీలక నాయకులు కూడా గతంలో అనేక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జగన్ ముందు మేం ఏం చెప్పినా వినరని, ఆయన చెప్పిందే వేదం అని అందుకే ఆయనను తట్టుకోలేక మేం బయటకు వచ్చామని వీరు చెప్పారు.
మంత్రి వర్గ సహచరుల్లో కనిపించని దూకుడు
అయితే, ఇదంతా నిజమేనా? జగన్ ఎవరికీ స్వతంత్రం లేకుండా ముందుకు సాగుతున్నారా? అంతా ఆయన ఇష్టమేనా? అంటే.. తాజాగా మంత్రి వర్గ కూర్పు నుంచి మంత్రులను కేటాయించడం వరకు ఎలా చూసినా.. ఆయన అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఆయనను పొగిడిన వారిని, ఆయనను నీ అంత వాడు లేడన్న వారిని పక్కన పెట్టిన సందర్భాలే మనకు ఇప్పటి వరకు కనిపించాయి. భట్రాజులను ఆయన బాబు మాదిరిగా వెనుకేసుకు వచ్చిన సందర్భాలే లేవు. అదే సమయంలో పనిచేసే వారిని వెతికి పట్టుకుని పోస్టులు ఇచ్చారు. మంత్రి వర్గ కూర్పులో సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం పెంచారు.కనీ వినీ ఎరుగని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అయితే, వీరిలో అటు మహిళా మంత్రులు కానీ, ఇటు పురుష మంత్రులు కానీ.. తమ బాణిని వినిపించడంలోను ప్రజలకు చేరువ కావడంలో చాలా వెనుకబడి ఉన్నారనేది వాస్తవం. పుష్పశ్రీవాణి, తానేటి వనిత, నారాయణ స్వామి, ధర్మాన కృష్ణదాస్, అంజాద్ బాషా ఇలా చాలా మంది మంత్రులు ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినా.. నాలుగు మూడు మాటలు మాట్లాడేసి చేతులు దులుపుకొన్నారు. అంతేతప్ప ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చిన సందర్భాలు లేనే లేవు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది.వాస్తవానికి అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని జగన్ చెప్పినా.. ఇంకా కొందరు మంత్రులు పార్టీ అధినేత కోణంలోనే జగన్ పై అపరిమిత గౌరవం ప్రదర్శిస్తూ.. కొన్ని నిర్ణయాల్లో దూకుడు చూపించలేక పోతున్నారనేది వాస్తవం. కానీ, జగన్‌పై అభిమానంతో ఆయన పట్ల ఉన్న గౌరవంతో మంచి నిర్ణయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విపక్షాలు చేస్తున్న పసలేని విమర్శలపై కూడా కౌంటర్లు ఇవ్వకపోతే.. గళం విప్పకపోతే.. నష్టపోయేది వీళ్లుకాదు జగనే అనే విషయాన్ని ఎందుకు గుర్తించలేక పోతున్నారని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మంత్రులు తమ శాఖల విషయంలో ఎప్పటికప్పుడు పట్టు పెంచుకుంటూ ముందుకు వెళ్లాలని జగన్ చెపుతున్నా వీరు మాత్రం ఆ దిశగా పని చేస్తున్నారా ? అంటే మెజార్టీ మంత్రుల విషయంలో సందేహాలే ఉన్నాయి. మరి ఇప్పటికైనా వీరు మారతారో లేదో ? చూడాలి.