సర్వశిక్ష అభియాన్‌లో అక్రమాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సర్వశిక్ష అభియాన్‌లో అక్రమాలు

విజయనగరం, ఆగస్టు 10, (way2newstv.com):
సర్వశిక్ష అభియాన్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. గతంలో సర్వశిక్ష అభియాన్ అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో అప్పట్లో ఎస్‌పిడి శ్రీనివాస్ ఆ పోస్టులను నిలిపివేసిన విషయం విధితమే. కాగా, తాజాగా జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్‌లలో పనిచేసేందుకు సీఆర్పీల నియామకాలకు సంబంధించి జిల్లాలో రూ.కోటి చేతులు మారినట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 220 సీఆర్పీ పోస్టులు ఉండగా వాటిలో 180 మంది వరకు వివిధ స్కూల్ కాంప్లెక్స్‌లలో పనిచేస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పడిన ఖాళీలు 40 ఉండగా వాటిలో గతంలో తాత్కాలిక పద్ధతిన అర్హత లేనప్పటికీ వాటిని రికమెండేషన్ పేర్లతో భర్తీ చేశారు.
సర్వశిక్ష అభియాన్‌లో అక్రమాలు

ఆ 40 పోస్టులకు సంబంధించి ఇపుడు కాంట్రాక్ట్ పద్ధతిలో వాటిని నియామకం చేసేందుకు సోమవారం జెసి-2 జె.సీతారామారావు ఆధ్వర్యంలో ఒక కమిటీ సర్ట్ఫికేట్లను పరిశీలన చేసింది. ఈ 40 సీఆర్పీ పోస్టులతోపాటు ఎంఐఎస్ పోస్టులకు సర్ట్ఫికేట్ల పరిశీలన జరిగినట్టు సమాచారం. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లాలోని ఓ రాజకీయ నేత ఎస్‌పిడి నుంచి ప్రోసీడింగ్‌లు తీసుకువచ్చినట్టు సమాచారం. ఆ మేరకు జిల్లాలో వీరికి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం జరిపేందుకు సర్ట్ఫికేట్ల పరిశీలన పూర్తి చేశారు. సీఆర్పీ నియామకానికి అభ్యర్థి డిగ్రీతోపాటు బిఇడి, టెట్ అర్హత కలిగి ఉండాలి లేదా సోషియాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కాగా, వీరిలో కొంత మందికి ఆ అర్హతలు లేనప్పటికీ వారిని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం ఒక్కొ పోస్టుకు అభ్యర్థుల నుంచి రూ.2 లక్షల మేరకు ఓ దళారీ వసూలు చేసినట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని బాహటంగా చెబుతున్నారు. అంతేగాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఈ పోస్టులను అమ్ముకున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.