విశాఖను టార్గెట్ చేసిన వైసీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖను టార్గెట్ చేసిన వైసీపీ

విశాఖపట్టణం, ఆగస్టు 10, (way2newstv.com
విశాఖలో జెండా పాతేయాలని వైసీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించాలని కూడా డిసైడ్ అయింది. విశాఖలో తాజా ఎన్నికల్లో నాలుగుకు నాలుగూ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని టీడీపీ బలంగా ఉంది. అందువల్ల ఆ పార్టీని వీలైనంత వరకూ దెబ్బ తీస్తేనే తప్ప వైసీపీకి చోటు ఉండదని ఫ్యాన్ పార్టీ అంచనా వేసుకుంటోంది. పైగా టీడీపీలో ఇపుడు గ్రూప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అసలే అధికారం లేదు, పైగా గొడవలతో పార్టీలో సీన్ సితారే అన్నట్లుగా ఉంది. దీని క్యాష్ చేసుకోవాలని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. సిటీ ప్రెసిడెంట్ గా ఉన్న ఎస్ ఎ రహమాన్ మీద వైసీపీ పెద్దల కన్ను పడిందని అంటున్నారు. ఆయన్ని సైకిల్ నుంచి దించేందుకు తెర వెనక కధ జోరుగా సాగుతోందని తెలుస్తోంది.
విశాఖను టార్గెట్ చేసిన వైసీపీ

విశాఖ అర్బన్ జిల్లా రాజకీయాలో ఎస్ ఎ రహమాన్ సీనియర్ నేత. ఆయన 1994 లో అప్పటి విశాఖ వన్ నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత మాత్రం మళ్ళీ ఎమ్మెల్యే కాలేకపోయారు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు రహమాన్ ఉడా చైర్మన్ గా చాలా కాలం పనిచేశారు. ఆ తరువాత టీడీపీ ఓడిపోవడంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి ప్రజారాజ్యంలోకి వెళ్ళిన ఆయన తిరిగి 2014 ఎన్నికల నాటికి సొంత గూడు టీడీపీలో చేరారు. రహమాన్ టికెట్ కోరినా అప్పట్లో బాబు సర్దుబాటు చేయలేకపోయారు. ఆ తరువాత ఆయన ఉడా చైర్మన్ పదవి మీద ఆశలు పెట్టుకున్నా వర్కౌట్ కాలేదు. ఎన్నికల ముందు విశాఖ టీడీపీ సిటీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దాంతో రహమాన్ ఇపుడు అధికారం లేని టీడీపీని వ్యయప్రయాసలకు ఓర్చి నడపాల్సివస్తోంది. ఇక పార్టీలో చూస్తే వర్గ పోరుతో రహమాన్ కి తలపోటు పెరిగిపోతోంది. రహమాన్ ని వ్యతిరేకిస్తున్న టీడీపీలోని మరో వర్గం ఆయన లేకుండానే పార్టీ మీటింగులు పెట్టి ఘోరంగా అవమానిస్తోంది. ఓ విధంగా పొమ్మంటూ పొగ గట్టిగానే పెడుతోంది. ఈ పరిస్థితులను గమనించిన వైసీపీ ఆయన్ని పార్టీలోకి రమ్మంటోంది.ఇదిలా ఉండగా రహమాన్ విశాఖ రాజకీయాల్లో బలమైన మైనారిటీ నేతగా ఉన్నారు. ఆయనకు విశాఖ సౌత్ తో పాటు నగరంలోని పలు అసెంబ్లీ సీట్లలో మైనారిటీలతో పాటు, ఇతర వర్గాల్లోనూ బాగా పట్టుంది. స్వతహాగా డాక్టర్ అయిన రహమాన్ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. దాంతో ఆయన్ని కనుక వైసీపీలో చేర్చుకుంటే పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు రాయబేరాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. మరి రహమాన్ రాజకీయ గురువు గంటా రూట్ ఎటో తెలియక ఇబ్బంది పడుతున్నారు. గంటా కనుక పార్టీని వీడితే రహమాన్ కూడా తన దారి తాను చూసుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే ఆయన్ని వైసీపీలోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయి.