రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్

ఒంగోలు, ఆగస్టు 28  (way2newstv.com)
రాజధాని వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతల నుంచి మొదలుకొని సామాన్య ప్రజానీకం వరకు అందరూ రాజధాని గురించి చర్చించుకుంటున్నారు. రాజధాని అంటే అందరిదని, ఏ ఒక్క సామాజిక వర్గానికో పరిమితం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజధాని గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ బాంబు పేల్చారు. అమరావతిలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలనేది గత ప్రభుత్వ సిద్ధాంతమని ఆయన ఆరోపించారు. 
రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ 

సూటిగా చెప్పాలంటే.. టీడీపీ హయాంలో రాజధాని ప్రకటనకు ముందు.. అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని చంద్రబాబు తన సన్నిహితులకు చెప్పారని.. దీంతో ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు, ముఖ్యంగా ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు రైతుల దగ్గర్నుంచి చౌకగా భూములను కొనేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ముందుగా తన వాళ్లకు చెప్పేసి.. వారు లబ్ధి పొందేలా బాబు సర్కారు వ్యవహరించిందనేది వైఎస్ఆర్సీపీ అభియోగం. అభివృద్ధి మొత్తం రాజధానిలో కేంద్రీకృతం కావడం తమకు ఇష్టం లేదని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. మిగతా ప్రాంతాల్లోనూ పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పాటు కావాలని కోరుకుంటున్నామని చెబుతోంది. కానీ సీఎం జగన్ అమెరికా వెళ్లడానికి ముందు ఓ ప్రాంతంలో భూములు కొనుక్కోమని తమ పార్టీ నేతలకు చెప్పారని.. టిక్కెట్లు ఇవ్వలేకపోయాం కానీ ఇలా లబ్ధి జరిగేలా చూస్తామని తమ పార్టీ నేతలతో జగన్ చెప్పారని టీడీపీ నాయకుడు దేవినేని ఉమా ఆరోపించారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి దొనకొండ ప్రాంతంలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆరోపించారు. అమరావతిలో అవినీతి వెతికినా దొరకదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించగా.. ఇప్పుడు జగన్ హయాంలో దొనకొండలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అంటే ఇరు వర్గాల వాదనలూ నిజమేనని భావిస్తే.. రెండు ప్రాంతాల్లోనూ.. ఇరు పార్టీలు తమ ‘సన్నిహితుల’కు లబ్ధి చేకూర్చాలని భావించాయా? అనే అనుమానం తలెత్తక మానదు. కానీ ఈ వ్యవహారాన్ని తేల్చడం అంత తేలికైన పనేం కాదు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పని చేయాల్సిన ప్రభుత్వాలు తమ అనునయులకు లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో ముందుకెళ్తే... తీవ్ర పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది మాత్రం నిజం.