అవినీతి అక్రమాల అడ్డాగా మండల రెవెన్యూ కార్యాలయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అవినీతి అక్రమాల అడ్డాగా మండల రెవెన్యూ కార్యాలయాలు

మహబూబ్ నగర్,  ఆగస్టు 14, (way2newstv.com)
అచ్చంపేట నియోజకవర్గంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన అమ్రాబాద్‌ మండలం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారుతుంది. రెవెన్యూ, మండల పరిషత్‌, ఉపాధి హామీ శాఖలలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పైరవీకారులు సంబంధిత అధికారులకు అమ్యమ్యాలను ఆశజూపి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో బ్యాంకుల్లోని రైతుల రుణాలను మాఫీ చేసేందుకు నివేధికలను సమర్పించాలని కోరగా అనేక మంది రైతులు బినామి రైతు పాసు పుస్తకాలపై రుణాలు తీసుకున్నట్టు బయటపడ్డాయి. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణలక్ష్మి పథకంలో అనర్హులు డబ్బులను తీసుకున్నారు. 
అవినీతి అక్రమాల అడ్డాగా మండల రెవెన్యూ కార్యాలయాలు
మండల పరిధిలోని పదర గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులెవ్వరూ పట్టించుకోక పోవడం లేదనే విషయం తెలుసుకున్న అచ్చంపేట నవతెలంగాణ గ్రామాన్ని సందర్శించి బాధిత కూలీలతో మాట్లాడడం జరిగింది. దీంతో అనేక ఆసక్తి కరమైన సంఘటనలు వెలుగు చూశాయి. గ్రామంలో మొత్తం 2061 జాబ్‌ కార్డులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 140 మంది వరకు కూలీలు మాత్రమే పనులు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటమ్మ మాత్రం సుమారు 25 మంది వరకు కూలీలు పనికి రాకపోయినా ప్రతి రోజు మష్టర్‌ వేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ తతంగం గత ఐదేండ్లుగా నడుస్తుందని గ్రామానికి చెందిన పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తగుళ్ళ రమాదేవి అనే మహిళ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నా మష్టర్‌ పేపర్‌లో బినామీ కూలీగా నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. తగుళ్ళ నాగలక్ష్మికి ఇటీవల వివాహం జరిగి ఇంటి వద్దే ఉంటున్నా మష్టర్‌ వేసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా తగుళ్ళ సైదయ్య సాక్షర భారత్‌ కోఆర్డీనేటర్‌గా కొనసాగుతున్నా మష్టర్‌లో పేరు నమోదు చేస్తున్నట్టు నివేదికలను బట్టి తెలుస్తుంది. ఇటువంటి బినామి కూలీలు కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును బినామి పేర్లతో దోచుకుంటున్నారు. విషయంపై ఎపిఓ శ్రీదేవికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. అంతే కాకుండా జాబ్‌ కార్డులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఏడాది అవుతున్నా కూడా గ్రామ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నేటి వరకు ఇప్పించక పోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం అని శంకర్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా సుమారు 130 మంది కూలీలకు పైగా బకాయి చెల్లింపుల కోసం నెలల కొద్ది నిరీక్షిస్తున్నారు. జక్కుల రేణయ్య జాబ్‌ కార్డు నెంబర్‌ 141884510005010451, ఏడు వారాలు పని చేసి ఏడాది కావస్తున్నా కూలీ బకాయిలు నేటి వరకు ఇవ్వడం లేదు. జక్కుల తిరుపతమ్మ జాబ్‌కార్డు నెంబర్‌ 0451, ఏడు వారాలు, పంతుల బుచ్చయ్య జాబ్‌కార్డు నెంబర్‌ 2048, ఏడు వారాల చొప్పున రెక్కలను ముక్కలు చేసుకుని పనులు చేసి ఏడాది కావస్తున్నా కూలి డబ్బులు ఇప్పించడం లేదని వ్రాత పూర్వకంగా తెలిపారు. అదేవిధంగా చిన్నిగారి నారయ్య జాబ్‌కార్డు నెంబర్‌ 0519, ఎనిమిది వారాలు, పని చేసి 6 నెలలు, ఎడ్మ చిన్న వెంకటయ్య జాబ్‌కార్డు నెంబర్‌ 0974, ఆరు వారాలు, ఆవుల నారమ్మ జాబ్‌కార్డు నెంబర్‌ 1176, ఐదు వారాలు పని చేసి 8 నెలలు, బీనమోని బాల్‌లచ్చమ్మ జాబ్‌కార్డు నెంబర్‌ 1104, రెండు వారాలుగా పనిచేసి 2 నెలలు కావస్తున్నా కూలి ఇవ్వలేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయి కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న కూలీలు గ్రామంలో 130 మందికి పైగానే ఉన్నారనడంలో ఆశ్చర్యం లేకపోలేదు. డబ్బులు ఇప్పించాలని కూలీలు అనేక సార్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వద్దకు వెళ్లి అడగగా అకౌంట్‌ నెంబర్‌ పంపించాననడం, మీ అకౌంట్లలో పడ్డాయి చూసుకోండని మాయ మాటలు చెబుతూ కాలం వెల్లదీస్తుండడంతో సహనం కోల్పోయిన కూలీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సంతకాల సేకరణ కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఏడాది కావస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.-