కశ్మీర్ లో ఏం జరుగుతోంది

శ్రీనగర్, ఆగస్టు 5, (way2newstv.com)

జమ్మూ కశ్మీర్‌లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రజల్లో గందరగోళం పెరిగింది.  కేంద్ర ప్రభుత్వం అక్కడికి మరిన్ని బలగాలను తరలించింది. 10 వేల మందితో ప్రారంభమైన అదనపు బలగాల మొహరింపు 35 వేలకు పైగా చేరింది. వీరిలో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ జవాన్లు ఉన్నారు. సున్నితమైన, కీలకమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ప్రధాన ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కశ్మీర్ లో ఏం జరుగుతోంది

కశ్మీర్‌లో ఏదో జరుగబోతోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెట్రోలు, నిత్యావసర సరకుల కోసం ప్రజలు బారులు తీరారు. గ్యాస్ రీఫిల్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మరోవైపు పర్యాటకులు లేక దాల్ సరస్సు వెలవెలబోతోంది. కశ్మీర్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అక్కడి నేతలంతా సమావేశమయ్యారు. జమ్ము కశ్మీర్ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్ అబ్దుల్లా నివాసంలో పార్టీలన్నీ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. కశ్మీర్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, సైనిక బలగాలను మోహరించడంపై నేతలందరూ చర్చించారు. అమర్‌నాథ్‌ యాత్రను అర్థంతరంగా నిలిపివేయటం ఇంతకు ముందెప్పుడు జరగలేదని.. దీనిపై ప్రధాని మోదీ ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ విషయంలో తామంతా ఏకధాటిపై ఉన్నట్లు స్పష్టం చేశారు. 
Previous Post Next Post