పోలీస్‌స్టేషన్‌ పై దాడి.. జనసేన ఎమ్మెల్యేఫై కేసు నమోదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోలీస్‌స్టేషన్‌ పై దాడి.. జనసేన ఎమ్మెల్యేఫై కేసు నమోదు

కాకినాడ ఆగష్టు 13  (way2newstv.com) :
జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. మలికిపురంలో ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్‌ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్నట్టు వచ్చిన సమాచారంపై మలికిపురం ఎస్సై కేవీ రామారావు తన సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఈ దాడిలో రూ.37,700 నగదు, ఆరు మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మీ తెలిపారు. దీనిపై క్రైం నంబర్‌ 182/2019గా గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. 
 పోలీస్‌స్టేషన్‌ పై దాడి.. జనసేన ఎమ్మెల్యేఫై కేసు నమోదు

వెంటనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్‌ సంఘటన స్థలంలో ఎస్సై రామారావుతో గొడవపడి మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకునేందుకు వీల్లేదని గొడవపడ్డారన్నారు.దీనిపై ఎస్సై ‘తాను అలా చేయడానికి లేదని, అవకాశం ఉంటే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి రిలీజ్‌ చేస్తాను’ అని చెప్పినా ఎమ్మెల్యే రాపాక సమక్షంలోనే గెడ్డం తులసీభాస్కర్‌ ఎస్సైతో వాగ్వివాదానికి దిగి ఇష్టానుసారంగా దూషించినట్టు ఎస్సై తెలిపారు. తరువాత ముద్దాయిలను, స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎమ్మెల్యే స్టేషన్‌కు తీసుకువచ్చారు. తరువాత కొందరు వ్యక్తులు ఎస్సై ఎమ్మెల్యేను నిందించినట్టు ప్రచారం చేశారన్నారు. దీంతో ఎమ్మెల్యే రాపాక, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్‌లు సుమారు 100 మంది అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీసులను నిందించుకుంటూ, పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వుతూ కిటీకీ అద్దాలు పగలుగొట్టారన్నారు. పేకాడుతూ పట్టుబడిన వ్యక్తులను తక్షణం విడుదల చేయాలని పోలీసుల విధులకు ఆటంక పరిచారని ఎస్పీ నయీం అస్మీ వివరించారు. పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరులపై ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ ఆదేశాల మేరకు క్రైం నంబర్‌ 183/2019 కింద సెక్షన్లు 143, 147, 148, 341, 427, 149, అండ సెక్షన్‌ 3 కింద పీడీపీపీ యాక్ట్‌ అండ్‌ క్రిమినల్‌ ఎమైండ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ నయీం అస్మీ వివరించారు.