కేకే... ఏమైపోయారు.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేకే... ఏమైపోయారు....

హైద్రాబాద్, ఆగస్టు 28, (way2newstv.com)
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లో పెద్ద ఎత్తున ఒక విష‌యంపై చ‌ర్చ న‌డుస్తోంది. గ‌డిచిన కొద్ది నెల‌లుగా ఓ కీల‌క నాయ‌కుడు కేసీఆర్ వెంట క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు దిగువ స్థాయి శ్రేణులు స‌హా మీడియా కూడా ఈ విష‌యాన్ని చ‌ర్చిస్తోంది. అయితే, ఎవ‌రికీ కూడా ఆన్సర్ చిక్కక పోవ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. ఆదిలో కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం ప‌నిచేసిన కేకే (కే. కేశ‌వ‌రావు) రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కీల‌క నేత‌గా ఎదిగారు. ఆ త‌ర్వాత ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ కాంగ్రెస్‌కు కూడా చీఫ్‌గా వ్యవ‌హ‌రించారు. త‌న‌కంటూ.. ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. అయితే, తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో మాత్రం కాంగ్రెస్‌తో విభేదించిన ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు.నేరుగా అప్పటి ఉద్యమ పార్టీ, నేటి అధికార పార్టీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 
కేకే... ఏమైపోయారు....

కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడ‌నే ముద్ర ప‌డ్డారు. ఈ క్రమంలోనే ఆయ‌న కేసీఆర్ ప్రోత్సాహంతో రాజ్యస‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. ఇటు, ప్రభుత్వంలోను, అటు పార్టీలోనూ కూడా నేరుగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా నెంబ‌ర్ -2 అనే స్థాయికి ఎదిగిన కేకే.. పార్టీ అధినేత కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా.. అక్కడ‌కు వెళ్లేవారు. గ‌త నెల కింద‌ట ఏపీకి వ‌చ్చిన స‌మ‌యంలోను కేసీఆర్ ప‌క్కన కేకే క‌నిపించారు. అంతేకాదు, రాజ‌కీయాల్లో ప్రత్యామ్నాయం సృష్టిస్తాన‌ని, బీజేపీ హ‌ఠావో.. అంటూ నినాదం చేసిన స‌మ‌యంలోను, వ్యూహాత్మక రాజ‌కీయాల‌కు తెర‌దీసిన స‌మ‌యంలోను కేకే కీల‌క పాత్ర పోషించారు.ఏదైనా జాతీయస్థాయి అంశాలు వచ్చినప్పుడు ఆయన పార్టీ తరఫున గట్టిగా మాట్లాడేవారు. పార్టీ శ్రేణులకు ట్రైనింగ్ ఇచ్చేవారు. వేదిక మీద కేసీఆర్ పక్కన కేకే ఉంటే పెద్దమనిషి తరహాగా ఉంటుందని పార్టీ వర్గాలు అంటుండేవి. సీఎం తన ప్రసంగాల్లో కూడా కేకే రాజకీయ అనుభవాలను ప్రస్తావించేవారు. అలాంటి కేకే ఇప్పుడు పార్టీలో యాక్టివ్ రోల్లో లేకపోవడంపై టీఆర్ఎస్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన హాజరు కూడా చాలా తక్కువగా ఉంటోంది2014 ఎన్నిక‌ల టైంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించిన కేకేను 2018 ఎన్నిక‌ల టైంకు ప‌ట్టించుకున్న వారే లేరు. ఆ ఎన్నిక‌ల్లో త‌న మాట వినే వారు లేక‌పోవ‌డంతో ఆయ‌న ఒకానొక ద‌శ‌లో నా బాధ‌ను గోడ‌కు చెప్పుకోవాలంటూ మీడియా ముందు సైతం అస‌హ‌నం వ్యక్తం చేశారు. చివ‌ర‌కు త‌న కుమార్తె విజ‌య‌ల‌క్ష్మికి సైతం గ్రేట‌ర్‌లో కార్పొరేట‌ర్ సీటు ఇప్పించేందుకు సైతం ఆయ‌న ఆపసోపాలు ప‌డాల్సిన ప‌రిస్థితి. ఇటీవ‌ల ఆయ‌న కేసీఆర్‌ను క‌ల‌వ‌డ‌మే గ‌గ‌నం అవుతోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సీఎం నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌‌కు మాత్రం కేకే హాజరయ్యారు. కానీ, గ‌తంలో మాదిరిగా రాసుకుని, పూసుకోకుండా పార్టీ రాజ‌కీయాల‌కు మాత్రం చాలా దూరంగా ఉన్నార‌ని తెలుస్తోంది.