కర్నూలు, ఆగస్టు 21 (way2newstv.com):
ట్రిపుల్ ఐటీ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మెరుగైన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించేలా చర్యలు చేపట్టింది. జగన్నాథగట్టు సమీపంలో ఏర్పాటు చేశారు. కళాశాల భవనాలు, వసతిగృహాలు, ప్రయోగశాలలు, పరిపాలన భవనం తదితరాలకు కేంద్రం నిధులు ఇచ్చింది. ఈ పనులన్నీ 2022లోపు పూర్తి చేసేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. మరోవైపు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్ద 2015లో ట్రిపుల్ ఐటీ (డీఎం) కళాశాలను కేంద్ర ప్రభుత్వం 151 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్సు ఇంజినీర్ కోర్సులతో గతేడాది తరగతులు ప్రారంభమయ్యాయి.
ఇక పరుగులే.. (కర్నూలు)
ఇటీవల మొదటి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ.218 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిపుల్ ఐటీ కళాశాలకు సంబంధించి మొదట విడతగా పరిపాలన భవనాన్ని రూ.6 కోట్లతో నిర్మించారు. వసతిగృహ భవనాలు, అకడమిక్ బిల్డింగ్ విస్తరణకు నిధులు ఖర్చు చేసి పూర్తి చేశారు. ఇప్పటికే వసతిగృహంలో బాలురు ఉంటున్నారు. మలి విడతలో పరిపాలన భవనం నుంచి మేనేజ్‌మెంట్ బ్లాక్ భవనంతోపాటు పలు పనులు చేపట్టాలని సంకల్పించారు.నిధుల మంజూరులో ఆలస్యం కాకుండా ఉండేందుకు కెనరా బ్యాంకు ద్వారా ఎంహెచ్‌ఆర్‌డీ నిధులు విడుదల చేస్తుంది. కేటాయింపులో అలసత్వం జరగకుండా ఉండేలా ఎంహెచ్‌ఆర్‌డీ పరిధిలో ‘ఎఫా’ ఏజెన్సీ పర్యవేక్షిస్తోంది. ఈ నిధులతో 2022లోపు 1,200 మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇదంతా 2017 నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాలి. ఇప్పటికే రెండేళ్లు పూర్తి కాగా మిగిలిన మూడేళ్లలో విద్యార్థులకు అవసరమైన విద్య, భవన నిర్మాణ పనులు, పాలన, క్రీడలు, రహదారుల పనులను పూర్తి చేయడమేకాక సాంకేతిక విద్యను అందించాల్సిన అవసరం ఉంది. పూర్తైన పనులకు సంబంధించి బ్యాంకు ద్వారా నిధులు తీసుకొనే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ప్రస్తుతం నాలుగు సంవత్సరాల కోర్సులో 450 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలో ప్రస్తుతం డిగ్రీ కోర్సులు అమలు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి పీజీ, పీహెచ్‌డీ కోర్సులు నిర్వహించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్టు పద్ధతిలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించారు. కళాశాల ఆవరణలో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. కిమ్స్ రెయిన్‌బో ఆస్పత్రి యాజమాన్యం నిరంతరంగా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. దీనికిగాను ప్రతినెలా రూ.2.50 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం మొదటగా నాలుగు అంశాలపై దృష్టి పెట్టారు. కళాశాల ఆవరణలో తరగతి గదులు, వసతిగృహాలు, పాలన బ్లాక్ భవన నిర్మాణాలను విస్తరించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు బాలికల వసతిగృహాన్ని అందుబాటులో తీసుకొచ్చి అవసరమైన వసతులు కల్పించాల్సి ఉంది. విద్యార్థులు భోజనం చేసేందుకుగాను హిల్‌టాప్ డైనింగ్ హాలు నిర్మాణం పూర్తి చేసేలా చూడాల్సి ఉంది.
Tags:
Andrapradeshnews