వర్షం పడిందంటే కరెంట్ కట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వర్షం పడిందంటే కరెంట్ కట్

ఏలూరు, ఆగస్టు 13, (way2newstv.com)
ఒకప్పుడు విద్యుత్ కోతలు దారుణంగా వుండి జనం నానా ఇబ్బందులు పడేవారు. ఆ తరువాత ఈ పరిస్థితి కొంత మెరుగుపడి అంతా సర్దుకున్నట్లే కనిపించింది. అయితే ప్రస్తుతం మాత్రం విద్యుత్ కోతలు విస్తృతంగా పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. చిన్న వర్షం జల్లు మొదలైనా విద్యుత్ కోతలు ప్రారంభమైపోతోంది. ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు కరెంటు పోతోందో, మళ్లీ ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియని పరిస్థితే కనిపిస్తోంది. టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసినా అక్కడ కూడా దాదాపు ఇదే సమాధానం వినిపిస్తూ వస్తోంది. ఇదైనా ఆ టోల్‌ఫ్రీ నెంబరుకు చేసినప్పుడు ఆ ఫోన్ ఎత్తితేనే. ఆ పరిస్థితి వచ్చిందంటే ఒక రకంగా జనం అదృష్టమనే చెప్పాలి. ఎప్పుడు చూసినా అది ఎంగేజ్‌లోనో లేక పూర్తిగా రింగ్ అయి ఊరకుండిపోవడమో తప్ప ఖచ్చితమైన సమాచారం మాత్రం ఇక్కడ నుంచి రాదనే చెప్పాలి. 
వర్షం పడిందంటే కరెంట్ కట్ 

ఈ పరిస్థితులన్నీ ఇలా వుంటే మరోవైపు ట్రాన్స్‌కో వద్ద వున్న గణాంకాలను పరిశీలిస్తే విద్యుత్ ఉంటే కూడా ఒక సమస్యే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. విద్యుత్ కోతలు ఒక సమస్య కాగా నిరంతర విద్యుత్ సరఫరా మరో సమస్యగానే ఈ గణాంకాలు చూస్తే భావించాల్సి వుంటుంది. 2015-16 నుంచి చూస్తే ఏటా విద్యుత్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు పెరుగుతూనే వచ్చాయి. దీనిలో మృతుల సంఖ్య కూడా చెప్పుకోగల రీతిలోనే వుండటం గమనార్హం. ఏది ఏమైనా మొత్తంగా చూస్తే విద్యుత్ ఉన్నా లేకున్నా కూడా ఒక సమస్యగానే మారిందని చెప్పవచ్చు. కాగా గత వేసవిలో మండుటెండల్లోనూ గతంలో ఏనాడూ లేని రీతిలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చింది. ఆ సమయంలో ఈ పరిస్థితి చూసి జనం మొత్తం దాదాపుగా ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. అలాంటి పరిస్థితి నుంచి వేసవి ముగిసి వర్షాకాలంలోకి అడుగుపెట్టిన వెంటనే కోతల జాడ్యం ట్రాన్స్‌కోను వేధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా జనానికి ఎప్పుడు విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారాలన్నీ ఇలా వుంటే ప్రమాద ఘటనల పరిస్థితి చూసుకుంటే 2015-16 నుంచి వీటి సంఖ్య పెరుగుతూనే వచ్చింది. 2015-16లో ఏకంగా 41 ప్రమాద ఘటనలు జరగగా 2016-17లో ఈ సంఖ్య 45కు చేరింది. 2017-18లో ఈ సంఖ్య 40కి పరిమితం కాగా 2018-19లో ఈ సంఖ్య 13కు చేరింది. అలాగే వీటిలో మృతుల సంఖ్య కూడా ఈ రీతిలోనే పెరుగుతూ వచ్చింది. ఏది ఏమైనా విద్యుత్ ప్రమాదాల కారణంగా సామాన్య జనం ప్రమాదాల బారిన పడుతూ మరణానికి చేరువవుతున్న పరిస్థితుల్లో దీనికి ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న వారు కూడా అతీతులు కాదన్న విధంగా సిబ్బందికి జరుగుతున్న ప్రమాదాలు కూడా నిరూపిస్తున్నాయి. వీరి విషయంలో ట్రాన్స్‌కో అధికారులు తగిన రీతిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే గణాంకాలను చూస్తే కనిపిస్తుంది. విద్యుత్ వైర్లు, ఇతర పరికరాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో సామాన్య ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలను వారికి పూర్తి అవగాహన వచ్చేలా చేయాల్సిన బాధ్యత అధికారులపైనే వుంటుందనడంలో సందేహం లేదు. అయితే జిల్లాకు సంబంధించి ఇలాంటి ప్రయత్నాలు చెప్పుకోదగ్గ రీతిలో జరగలేదనే చెప్పుకోవాలి.