రైతుకు ధీమా (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతుకు ధీమా (కరీంనగర్)

కరీంనగర్, ఆగస్టు 21 (way2newstv.com): 
రైతు బీమా పథకం కర్షక కుటుంబాలకు ధీమానిస్తోంది. అన్నదాత మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం రూ.5లక్షల బీమాను అందజేస్తున్న విషయం తెలిసిందే. గతంలో రైతుల కుటుంబాల్లో రైతు మృతిచెందితే ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. వ్యవసాయానికి సైతం దూరమై కూలీనాలి చేస్తున్న కుటుంబాలు అనేకం. రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా..లేదానన్నది అనుమానమే. అధికారులు, కార్యాయాల చుట్టూ చెప్పులరిగిలా తిరిగినప్పటికీ ప్రయోజనం శూన్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
రైతుకు ధీమా (కరీంనగర్)

గతంలో అప్పులపాలై రైతులు ఆత్మహత్యకు పూనుకుంటే సవాలక్ష నిబంధనలతో ఇబ్బందులు పడేవారు. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ బీమా పథకంలో రైతులు ఏ విధంగా మరణించినప్పటికి బీమా పథకాన్ని అమలు చేస్తూ వారి కుటుంబాలకు భరోసానిస్తున్నారు. రైతు బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం గడువును ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుబీమా పథకం ద్వారా రైతు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.5లక్షల పరిహారాన్ని అందిస్తున్నారు. పక్షం రోజుల్లోనే ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టారు. ఒక్కో రైతుకు ప్రభుత్వం రూ.2,271.50 బీమాను ఎల్‌ఐసీకి చెల్లించింది. ఈ ఏడాది బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3555.94 చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కంటే ఈ ఏడాది రూ.1284 అదనంగా చెల్లిస్తోంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులకు వర్తిస్తుంది. గతేడాది బీమాలో చేరిన రైతులు యథావిధిగా రెండో సంవత్సరం కొనసాగుతారు. 18 సంవత్సరాలు నిండిన రైతులు ఈ పథకంలో చేరాలంటే సంబంధిత మండల వ్యవసాయ అధికారికి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా నకళ్లు అందించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నామిని బ్యాంకు ఖాతా పాసుపుస్తకం నకలు, నామిని ఆధార్‌ కార్డు నకలు ఇవ్వాలి. ఆధార్‌ కార్డులో ఉన్నట్లే పట్టాదారు పాసుపుస్తకంలో వివరాలుండాలి. ఒకవేళ తప్పుగా ఉంటే తప్పనిసరిగా సరిచేసుకోవాల్సిందే. జిల్లాలో 1.71లక్షల మంది రైతులుండగా వీరిలో 1.57లక్షల మంది పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. కాగా 18 సంవత్సరాల వయస్సు నుంచి 59 సంవత్సరాల వయసు గలవారు 97,232 మంది రైతులు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. వీరందరికి రైతుబీమా పథకం వర్తించనుంది. గతేడాది నుంచి ఇప్పటివరకు జిల్లాలో 333 మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. అయితే 305 మందికి రైతుబీమా ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందజేశారు. మొత్తంగా రూ.15.25కోట్లను రైతుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేశారు. రైతుబీమా పథకం పొడిగింపుపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సాయం కొరకు రైతుబంధు పథకం ద్వారా ఆదుకోవడమే కాకుండా రైతు మరణించిన తర్వాత ఆ కుటుంబం వీధిన పడకుండా రూ.5లక్షలు అందజేసి ప్రభుత్వం అండగా ఉండటం స్వాగతించదగ్గ పరిణామం. అయితే రైతులకు వయసుతో పరిమితి లేకుండా బీమా అమలు చేస్తే మరింత మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వాస్తవానికి 65-70 ఏళ్ల వయసు గలవారు వ్యవసాయం చేస్తున్నారు. సుమారు వీరి సంఖ్య 10వేల వరకు ఉంటుందని అంచనా. ఏవుసం చేసే రైతులందరికి బీమా వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. కాగా 18ఏళ్లు నిండిన రైతులు ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా, నామిని ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా నకళ్లు వ్యవసాయ అధికారికి అందజేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ తెలిపారు. 60ఏళ్లు నిండిన వారినందరిని పథకం నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు.