పెద్ద దిక్కు కోసం వెయిటింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పెద్ద దిక్కు కోసం వెయిటింగ్

కర్నూలు, ఆగస్టు 13, (way2newstv.com)
నిన్న మొన్నటి వరకు కర్నూలు రాజకీయాలు సైకిల్‌ చుట్టూ తిరిగాయి. మాకు టికెట్‌ ఇవ్వండి మహప్రభో అంటే మాకివ్వండి! అంటూ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద క్యూకట్టారు. అంతేకాదు, పార్టీలు ఏవైనా.. తమ గమ్యం టీడీపీనే అంటూ.. నాయకులు పార్టీలోకి వచ్చి చేరారు. దీంతో ఒక్కసారిగా నేతల రాక పుంజుకుని.. పార్టీ కిక్కిరిసిపోయింది. వైసీపీ నుంచి ఎక్కువగా వలసలు కొనసాగాయి. ఎన్నికల ముందు కూడా ఇలా వైసీపీ నుంచి జంప్‌ చేసి వచ్చిన నాయకులతో పార్టీ కళకళలాడింది. అందరూ కూడా రెండోసారి టీడీపీ గెలిచి తీరుతుందని ప్రగాఢ విశ్వాసం ప్రదర్శించారు. అయితే, అనుకున్నదొకటి.. అయింది ఒకటి.. అన్నట్టుగా ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది.కర్నూలులో వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీలోని కీలక నేతలు కూడా ఓటమి బాటపట్టారు. తమకు తిరుగేలేదని అనుకున్న నాయకులు సైతం జావగారిపోయారు. 
పెద్ద దిక్కు కోసం వెయిటింగ్

ముఖ్యంగా మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ వైరంతో ముందుకు సాగిన కుటుంబాలు కోట్ల, కేఈలు సైతం ఈ ఎన్నికల్లో ఒకే పార్టీ గొడుగు కిందకు వచ్చి.. ఎన్నికల్లో ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. అయినప్పటికీ.. ప్రజలు మాత్రం టీడీపీని ఓడించారు. దీంతో ఇప్పుడు మళ్లీ యథాతథ స్థితి ఏర్పడింది.జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లతో పాటు క‌ర్నూలు, నంద్యాల ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. అస‌లు టీడీపీకి ఒక్క సీటు కూడా రాని ప‌రిస్థితి. ఎంత విచిత్రం అంటే చివ‌ర‌కు 2014లో కూడా ఇక్కడ టీడీపీ కేవ‌లం మూడు సీట్లతో స‌రిపెట్టుకుంది. దీనిని బ‌ట్టి జిల్లాలో గ‌త ద‌శాబ్దంన్నర కాలంలో టీడీపీ ఎంత వీక్‌గా ఉందో తెలుస్తోంది. ఇక, ఎన్నికలకు వారాల వ్యవధిలో పార్టీలు మారి వచ్చిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కుటుంబం సహా.. భూమా కుటుంబం కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాథుడు కనిపించడం లేదు. పోనీ.. దశాబ్దాలుగా పార్టీ ఉప్పుతిన్న, పదవులు అనుభవించిన కేఈ కుటుంబం అయినా.. ఇప్పుడు చురుగ్గా ఉందా? అంటే అదీ లేదు. ఎన్నికల్లో ఓటమి నుంచి కేఈ కుటుంబం ఇంకా తేరుకోలేదని తెలుస్తోంది.మరోపక్క,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో నిత్యం ఘర్షణకు పాల్పడిన టీడీపీ సీనియర్‌ నేత ఎస్వీ సుబ్బారెడ్డి వర్గం కానీ, శ్రీశైలం 2014లో వైసీపీ తరఫున గెలిచి తర్వాత టీడీపీలోకి చేరిన రాజశేఖర్‌ కానీ ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. వీరంతా కూడా పార్టీని సమన్వయం చేయడంలోను, కార్యకర్తలను ముందుండి నడిపించడంలోనూ కూడా ఎక్కడా చురుగ్గా వ్యవహరించడం లేదు. ఇదిలావుంటే, జిల్లాల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు సైతం.. పార్టీ పటిష్టానికి ఎక్కడా కృషి చేయక పోవడం మరింతగా తమ్ముళ్లను కుంగదీస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారాయని అంటున్నారు పరిశీలకులు.