కేసీఆర్ స్టైలే వేరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ స్టైలే వేరు

హైద్రాబాద్, ఆగస్టు 12, (way2newstv.com)
మీరు దర్శకత్వం వహిస్తే నేను నిర్మాణ బాధ్యతలు చేపడతా. ఈ మాటలు చెప్పింది మామూలు వ్యక్తికాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆఫర్ అందుకున్న వ్యక్తి కళాతపస్వి కె. విశ్వనాధ్ కావడం గమనార్హం. రాజకీయాలు పక్కన పెట్టి వీకెండ్ కేసీఆర్ అకస్మాత్తుగా కళాతపస్వి ఇంటి బాట పట్టారు. ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. ఇంతకి విశ్వనాధ్ కి ఏమైంది అన్న ఆందోళన సైతం చక్కెర్లు కొట్టింది. అసలు విషయం తెలిసాక ఔరా అనుకున్నారు అందరూ.కేసీఆర్ ఏం చేసినా అందులో ఒక కిక్ వుండేలాగే చేస్తూ వుంటారు. వ్యవసాయం చేసి ఎకరాకు కోటిరూపాయల ఆదాయం సంపాదించినా, యజ్ఞాలు యాగాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో కొత్త రికార్డ్ లు నెలకొల్పినా, ఫలితాలు రాకుండానే మహాకూటమి వదిలి ఎన్డీయే లో చేరిపోయినా, లేక థర్డ్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసినా గులాబీ బాస్ కే చెల్లింది. ముఖ్యమంత్రి పాలన కన్నా ఆయనకు ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో పుస్తకపఠనమే ఇష్టం. 
కేసీఆర్ స్టైలే వేరు

పాలన అధికార యంత్రాంగంపైనా వదిలి సాహిత్య లోకంలో అప్పుడప్పుడు మునిగితేలుతారు కేసీఆర్ . అలాంటి కేసీఆర్ ఇలా సడెన్ గా కళాతపస్విని కలవడం వెనుక రీజన్ వుంది. సాహిత్యం కళలు అంటే చెవికోసుకునే కేసీఆర్ రిలాక్స్ అయిన సందర్భంలో పాటలు వింటున్నారు. అలా వింటున్న సందర్భంలో ఒక అద్భుత సాహిత్యం తో కూడిన పాట విన్నారు ఆయన. ఆయన కళ్ళముందు విశ్వనాధ్ కనిపించారు. మది పులకించడంతో వెంటనే కళాతపస్వికి ఫోన్ చేసి మిమల్ని కలవాలని అనుకుంటున్నా అని చెప్పడంతో విశ్వనాధ్ ఆశ్చర్య పోయి ఆహ్వానించారు.అనుకున్నదే తడవు కేసీఆర్ ఆదివారం విశ్వనాధ్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. చాలాసేపు ఇద్దరు సాహిత్య సంభాషణలు సాగించారు. విశ్వనాధ్ సై అంటే ఒక విలువలతో కూడిన సంగీత సాహిత్య సినిమా కు నిర్మాణ బాధ్యతలు వహిస్తా అంటూ గులాబీ బాస్ అన్నారుట. దాన్ని విశ్వనాధ్ సున్నితంగా తిరస్కరించి ఇప్పుడు దర్శకత్వం వహించలేనని చెప్పేశారు ఆయన. కేసీఆర్ తన ఇంటికి ముఖ్యమంత్రి హోదాలో రావడంపై తనదైన శైలిలో స్పందించారు కళాతపస్వి. కుచేలుడి దగ్గరకు కృష్ణుడు వచ్చినట్లు ఉందంటూ చమత్కరించారు. కేసీఆర్ అభిరుచులు సాహిత్యాభిలాష, పద్యపఠనం అద్భుతమన్నారు కె. విశ్వనాధ్. నాటి సినిమాలు సాహిత్యం పై కూడా చర్చించామని చెప్పి తన ఆనందాన్ని పంచుకున్నారు కళాతపస్వి. అజరామరం లాంటి అనేక తెలుగు సినిమాలను అద్భుతంగా అందించిన కె విశ్వనాధ్ అభిమానులు ఈ పరిణామం పట్ల మరింత సంతసిస్తున్నారు.