విశాఖపట్టణం, ఆగస్టు 17, (way2newstv.com)
ఒక మోస్తరు వర్షం కురిసిందంటే నగరంలోని వివిధ ప్రాంతాల వ్యర్థాలన్నీ సముద్రంలోకి వచ్చేస్తున్నాయి. సముద్రంలో కలుస్తున్న గెడ్డలు వ్యర్థాలను మోసుకొస్తుండడంతో సాగరతీర పరిసరాలు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. గత ఆదివారం కురిసిన వర్షానికి గెడ్డలు పొంగి పొర్లి ప్రవహించాయి. అన్ని గెడ్డల మాదిరిగానే లాసన్స్ బే కాలనీ వద్ద సముద్రంలో కలుస్తున్న గెడ్డ భారీఎత్తున వ్యర్థాలను మోసుకొచ్చి సముద్రంలోకి చేర్చింది. సముద్ర కెరటాల ధాటికి ఆవ్యర్థాలన్నీ లాసన్స్‌బే కాలనీ పార్కు, పెదజాలరిపేట, వాసవానిపాలెం, అప్పుఘర్ తదితర తీరప్రాంతాలలో పరుచుకుంది. నగరంలోని సీతమ్మధార, హెచ్‌బికాలని, కెఆర్‌ఎం కాలని, ఇసుకతోట తదితర ప్రాంతాల నుంచి ఎంవిపి.కాలనీలో ప్రవేశించిన గెడ్డ సెక్టార్-1, సెక్టార్-2, సెక్టార్-3, సెక్టార్-5, సెక్టార్-7, సెక్టార్-8, సెక్టార్-11ల మీదుగా ప్రవహించి లాసన్స్ బే పార్కువద్ద సముద్రంలో కలుస్తోంది.
వ్యర్థాలతో సముద్ర తీరం
ఆయా ప్రాంతాలలో నివాసితుల విసిరేసిన వ్యర్థాలను గెడ్డ మోసుకొచ్చి సముద్రంలో కలిపేస్తొంది. దీంతో బీచ్ పరిసరాలు వ్యర్థాల మయంగా తయారవుతోంది. ఈ వ్యర్థాలలో ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు, సీసాలు, కొబ్బరిబొండాలు తదితరమైన వెన్నో కనిపిస్తున్నాయి. పారిశుధ్య సిబ్బంది మంగళవారం శ్రమించి పూర్తి స్థాయిలో బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా 7వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ త్రినాధరావును బీచ్‌లో చేరే వ్యర్థాలగురించి ప్రశ్నించగా వ్యర్థాలలో ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువగా కనిపిస్తోందని, కొబ్బరి బొండాల వ్యాపారులు వ్యర్థంగా మారిన కొబ్బరి బొండాలను గెడ్డల్లో వేస్తుండడంతో , ఇంకా పలు రకాల వ్యర్థాలను గెడ్డల్లో వేస్తుండడంతో భారీ వర్షం కురిసినపుడు గెడ్డ వేగంగా ప్రవహించడంతో వ్యర్థాలన్నీ సముద్రంలో చేరి కెరటాల ధాటికి వాసవానిపాలెం, లాసన్స్ బే పార్కు పరిసరాలు అధ్వాన్నంగా తయారవుతున్నాయని పారిశుధ్యసిబ్బంది శ్రమించడంతోపాటు యంత్రాల సాయంతోను బీచ్‌ను పరిశుభ్రం చేస్తున్నామని తెలిపారు. వ్యర్థాల కారణంగా దోమలు విజృంభించి వ్యాధుల వ్యాప్తి జరుగుతుందని దీనిపట్ల ప్రజలు అవగాహన పొందాలని, స్వచ్చ సర్వేక్షణ్‌లో ప్రతి ఒక్కరూ భాగం కావాలని అన్నారు.గెడ్డలకు అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తే వ్యర్థాలు అక్కడ ఆగిపోయి నీరు మాత్రం సముద్రంలో కలుస్తుందని, అలా చేయక పోవడంతో ఈ వ్యర్థాలు సముద్రంలో కలిసి పోతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎక్కడికక్కడ వ్యర్థాలను గెడ్డలోనే ఫిల్టర్ చేస్తే కాస్త చెత్త తగ్గుతుందని, త్వరిత గతిన జివిఎంసి వాటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Tags:
Andrapradeshnews