నిబంధనల పేరుతో తూట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిబంధనల పేరుతో తూట్లు

ముందుకు సాగని జ్యోతిబాపూలే పథకం
వరంగల్‌‌, ఆగస్టు 21, (way2newstv.com)
ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశీ విద్య అందించేందుకు ప్రారంభించిన పథకం అసలు లక్ష్యం నెరవేరకుండా నిబంధనల పేరుతో తూట్లు పొడుస్నురు. బిసి విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా పూలే విద్యా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం 311 మంది దరఖాస్తు చేసుకుంటే వీరిలో చిన్న చిన్న పొరపాట్లు చూపుతూ 261 మంది విద్యార్థుల భవిష్యత్తును అధికారులు ప్రశ్నార్థకంగా మార్చారు. వివిధ దేశాల్లో గుర్తింపు పొందిన కోర్సులు చదివేందుకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారు. ఎక్కువ మంది అమెరికా చదువుపై ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకునేప్పుడు ఆర్థిక పరిస్థితి వివరించాలి. 
నిబంధనల పేరుతో తూట్లు

సీటు లభించే విద్యార్థికి అమెరికా యూనివర్సిటీ ఐ 20 పంపిస్తుంది. ఐ 20 ఉంటేనే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడే అసలు కథ ఉంది. ఐ 20 రావాలంటే కనీసం ఏటా నాలుగు లక్షల రూపాయల ఆదాయం అయినా ఉండాలని, అంత కన్నా తక్కువ ఆదాయం ఉంటే ఫీజు భరించలేరు అని యూనవర్సిటీ సీట్లు ఇవ్వదని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. వాస్తవం కూడా అదే. సీటు కోసం దరఖాస్తు చేసేప్పుడు కనీసం నాలుగు లక్షల రూపాయల ఆదాయం అని చూపాలి. ఇక మహాత్మా జ్యోతిబా పూలే విద్యా పథకం కింద సహాయం కోసం దరఖాస్తు చేయాలంటే సంవత్సర ఆదాయం రెండు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నవాళ్లు అర్హులు. అంతకు మించి ఆదాయం ఉంటే ఈ పథకం వర్తించదు. ఈ పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసేప్పుడు తమ సంవత్సర ఆదాయం ఏడాదికి రెండు లక్షల రూపాయల లోపే అని ఎంఆర్‌ఓ నుంచి సర్ట్ఫికెట్ పొందుతారు.విద్యా సహాయం పథకం కింద బిసి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు వివరాలు సరైనవేనా కావా? అని విచారించేందుకు అభ్యర్థి ఇంటికి రెండు మూడుసార్లు వచ్చి విచారిస్తారు. ఆ సమయంలో ఐ 20 కోసం దరఖాస్తు చేసేప్పుడు ఆదాయం నాలుగు లక్షలు అని చూపినట్టు తేలగానే దరఖాస్తును పక్కన పెడుతున్నారు. నాలుగు లక్షల ఆదాయం అని చూపించారు కాబట్టి మీకు ఈ పథకం వర్తించదు అని చెబుతున్నారు. ఎంఆర్‌ఓ ఇచ్చిన ఆదాయ దృవీకరణ పత్రం మాత్రమే వీరికి ప్రామాణికం కావాలి కానీ ఇంటికి వచ్చి విచారించిన ఉద్యోగులు ఆదాయం రెండు లక్షల కన్నా ఎక్కువ ఉంది అని చెబితే ఇక ఆ విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినట్టే. ఇక దరఖాస్తు ఆమోదం పొంది ఈ పథకం కింద అర్హత ఉన్నా తొలుత ఒక సెమిస్టర్ వరకు విద్యార్థి సొంత డబ్బుతో ఫీజు చెల్లించాలి. ఆ తరువాత ఈ పథకం కింద సహాయం అందజేస్తారు. మొదటి సెమిస్టర్‌కు కనీసం ఐదు లక్షల రూపాయల వరకు వ్యయం అవుతాయి. అప్పు చేయడమో, సొంతగా సమకూర్చుకోవడమో ఏదో రకంగా ఐదు లక్షల రూపాయల పరపతి ఉండాలి. అలా అయితేనే ఈ పథకం కింద విదేశీ విద్యా సహాయం పొందుతారు.ఇంటికి వచ్చి విచారించే ఉద్యోగులు విదేశీ విద్యకు ఎలా పంపిస్తున్నారు అని అడిగితే బంధువుల నుంచి సమకూర్చుకుంటాం, మాకున్న 60 గజాల స్థలం తనఖా పెడతాం అని సమాధానాలు చెప్పినా ఇబ్బందిగా మారుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పుడు ఈ పథకం మీకెలా వర్తిస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. మొదటి టర్మ్ ఫీజు చెల్లించే స్థోమత ఉంది అని చెబితే, పథకం వర్తించదు అంటారు, స్థోమత లేదు అంటే మరెలా పంపిద్దామని అనుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారని విద్యా సహాయ పథకం కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తండ్రి ఒకరు వాపోతున్నారు.