గ్రామాల్లో వడివడిగా అభివద్ధి పనులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామాల్లో వడివడిగా అభివద్ధి పనులు

ఒంగోలు, ఆగస్టు 13, (way2newstv.com)
ఒకటికాదు రెండు కాదు నాలుగేళ్లుగా పంచాయతీల్లో పనులు దక్కక, సర్పంచ్‌లు అడ్డంకిగా మారి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగుతమ్ముళ్లకు ఇప్పుడు స్వేచ్చ లభించింది. పంచాయతీలలో సర్పంచ్‌ల పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కావడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి తెలుగుతమ్ముళ్లకు ఇదే అదునుగా మారింది. గ్రామదర్శిని పేరుతో ఊరూరా ప్రభుత్వం చేపట్టే పథకాలకు నిధులు సంతృప్తిగా ఇస్తుండటంతో తమ్ముళ్ల ఆనందానికి అవధులు లేవు. కేంద్రం ద్వారా వస్తున్న నిధులను ఖర్చుచేసేందుకు జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ఆయా పంచాయతీల్లో రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలకు కాంపొండ్లు, హాస్టళ్లకు కాంపౌండ్లు, సాంఘిక సంక్షేమశాఖకు భవనాలు , అంగన్వాడీ కేంద్రాలు, పార్కులు, రైతు మార్కెట్లు, డ్రైనేజీలు, స్కూల్ భవనాలు, పారిశుద్ధ్యం కేంద్రాలు వంటివి నిర్మించేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తామంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. 
గ్రామాల్లో వడివడిగా అభివద్ధి పనులు

ఈ పనులను గుర్తించి ప్రారంభించేందుకే గ్రామదర్శినిని ఈనెల మొదటివారం నుంచి ప్రారంభించారు. ప్రతి పంచాయతీకి మండల స్థాయి అధికారుల బృందం వెళ్లి, ఆగ్రామ ప్రాంతాల ప్రజల నుండి ఆ ప్రాంతానికి ఏమి కావాలో తెలుసుకుని వాటిని సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. తమ ప్రాంతంలో ప్రతి పనిని దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతలు ఆయా పంచాయతీల స్థాయిలోని ప్రత్యేక అధికారుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. మూడునెలల్లో ప్రతి పంచాయతీలో ఎలాంటి సమస్య ఉండకూడదని ఇందుకు అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించి, చర్యలు తీసుకోవడమే గాకుండా ప్రతిపాదించిన ప్రతి పనిని వెంటనే పూర్తి చేయాలని ఇందుకు నిధుల కొరత ఉండదని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు కావాల్సినంత నిధులు వస్తున్నాయి, ఇప్పటికే నాలుగు నెలల్లో రూ.200కోట్లు ఉపాధి పనులు పూర్తిచేశారు. ఈ ఏడాది చివరినాటికి మరో రూ.200-రూ.250కోట్ల నిధులతో అన్ని పంచాయతీల్లో పనులు పూర్తి చేసేందుకు కలెక్టర్ పరుగులు తీస్తున్నారు. కార్యక్రమం మరింత చురుగ్గా సాగేందుకు వీలుగా సాక్షాత్తు కలెక్టర్, జిల్లా స్థాయి లోని అధికార కార్యక్రమాలు సైతం పక్కనపెట్టి పల్లెల్లో తిరుగుతున్నారు. ఆయాగ్రామాల్లో నేతల సిఫార్సులకు సంబంధం లేకుండా అధికారులే ఎలాంటి పనులు చేపట్టాలో నిర్ణయిస్తున్నారు. దీంతో జిల్లాలోని 758 పంచాయతీల్లో నాలుగేళ్లుగా ముందుకుసాగని అనేక పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకూ మెజార్టీ పంచాయతీల్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగేది. ఫలితంగా నాలుగేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశంపార్టీ పంచాయతీల్లో పనులు చేపట్టలేకపోయింది. ఆ ప్రాంతాల్లో నేతలున్నా వారు ఎలాంటి పనులు చేయలేకపోగా ప్రజల నుండి అసంతృప్తి ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. మరోవైపు పార్టీ కార్యకర్తలకు ఆర్థిక ఇబ్బందులను తీర్చే అవకాశమూ లేకపోయింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోగానే ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించడంతో తెలుగుతమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు వారికి గ్రామదర్శిని ఒక వరంగా మారింది. ఇదే వేదికగా మార్చుకుని పనులు దక్కించుకునేందుకు ఎవరికితోచిన స్థాయిలో వారు అధినేతలతో సిఫార్సులు చేయించుకుంటూ పనులు దక్కించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ మూడునెలల కాలంలో ప్రతి పంచాయతీలో లక్షలాది రూపాయల పనులు చేపట్టేందుకు మండల స్థాయి ఇంజనీరింగ్ అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. ఈ నివేదికలు ఆధారంగా జిల్లాకు భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయి. కేంద్రం నుండి వచ్చే ఉపాధిహామీ నిధులను ఈ పనులకు మళ్లించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో ఇటు పార్టీ ప్రతిష్ట పెంచుకునేందుకు, అటు తమపార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు ఈ గ్రామదర్శినిని ప్రభుత్వం ఒక పాచికగా అమలు చేస్తోందన్నది వాస్తవం..