కర్నూలులో కొనసాగుతున్న వర్షాభావం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలులో కొనసాగుతున్న వర్షాభావం

కర్నూలు, ఆగస్టు1 (way2newstv.com)
కర్నూలు జిల్లా అంతటా తీవ్ర కరువు పరిస్థితులు కన్పిస్తున్నా..వారి నిర్ధారణలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.  కేవలం ఏడు మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పత్తికొండ వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, డోన్‌ సబ్‌ డివిజన్‌లోని ప్యాపిలి, డోన్, ఆలూరు సబ్‌ డివిజన్‌లోని కౌతాళం మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు అంచనా వేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.ఇలాంటి నివేదికల కారణంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. రెండు నెలలుగా వరుణుడు మొహం చాటేస్తున్నాడు. ఖరీఫ్‌లో రెండు నెలలు గడిచినా.. సాగు విస్తీర్ణం మాత్రం 51 శాతానికే పరిమితం కావడం ఇందుకు నిదర్శనం. 
కర్నూలులో కొనసాగుతున్న వర్షాభావం

కౌతాళం, కోసిగి, శ్రీశైలం, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, ఆదోని, హొళగుంద, దేవనకొండ, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, కోవెలకుంట్ల, బనగానపల్లి, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, శిరివెళ్ల, రుద్రవరం, కోడుమూరు, సంజామల, సి.బెళగల్, గూడూరు తదితర మండలాల్లో లోటు వర్షపాతం ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని మండలాల్లోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలని రైతులు, రైతుసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో ఆశాజనకంగా వర్షాలు పడగా.. ఈసారి మాత్రం అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జూలైలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా ఒక్క మండలంలో మాత్రమే నమోదైంది. మిగిలిన 53 మండలాల్లోనూ లోటు వర్షపాతమే.  ఖరీఫ్‌ సీజన్‌లో రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలో నమోదైన వర్షపాతాన్ని చూస్తే జిల్లా అంతటా కరువు పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.  జూన్‌లో సాధారణ వర్షపాతం 77.2 మి.మీ ఉండగా.. 66.5 మి.మీ, జూలైలో 117.2 మి.మీకి గాను సోమవారం నాటికి 52.9 మి.మీ మాత్రమే నమోదు కావడం గమనార్హం. జూలైలో కేవలం హాలహర్వి మండలంలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంది. పగిడ్యాల మండలంలో సాధారణం మేరకు వర్షాలు పడినప్పటికీ 12 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. 20 శాతం వరకు లోటు ఉన్నా.. సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. మిగిలిన 52 మండలాల్లో 93 నుంచి 30 శాతం వరకు లోటు వర్షపాతం ఉండటం గమనార్హం. ఖరీఫ్‌ మొదటి రెండు నెలల్లోనే డ్రైస్పెల్‌లు రెండు ఉన్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యవసాయ యంత్రాంగం ప్రస్తుతం కరువు నివేదికను సిద్ధం చేస్తోంది. కాగా..గడువు ముగిసినందున ఇక మీదట వేరుశనగ సాగు చేయకపోవడమే మంచిదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు