శ్రీనగర్, ఆగస్టు 24 (way2newstv.com)
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులను తెలుసుకోడానికి అక్కడ పర్యటనకు విపక్షాలు సిద్ధమైన వేళ రాజకీయంగా మరింత వేడి రాజుకుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రాహుల్ గాంధీతో కూడిన విపక్ష బృందం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. అయితే, కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులున్నాయని చెబుతున్న కేంద్రం, అక్కడ పర్యటించేందుకు ఎవర్నీ అనుమతించకపోవడం ఏంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.
కశ్మీర్ పర్యటనలో విపక్షాలు
ఓవైపు కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, మరోవైపు అక్కడ పర్యటించడానికి ఎవర్నీ అనుమతించడం లేదని మండిపడ్డారు. ఇంతటి విరుద్ధ ప్రకటనలు ఎప్పుడూ చూడలేదని, ఒకవేళ పరిస్థితులన్నీ సాధారణంగానే ఉంటే రాజకీయ నాయకుల్ని ఇంకా గృహ నిర్బంధంలో ఎందుకు ఉంచారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్సీపీ నేత మజీద్ మెమన్ మాట్లాడుతూ.. ‘విపక్షాల పర్యటనతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ప్రభుత్వ వాదన నిరాధారమైందని కొట్టేపారేశారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతల పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సీనియర్ నేతలు ఇక్కడ పర్యటించే ప్రయత్నం చెయ్యొద్దని అధికారులు కోరిన విషయం తెలిసిందే. అలాగే అనేక ప్రాంతాల్లో ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తాజా పర్యటన.. నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ప్రకటించింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని అధికారులు సూచించారు. సీమాంతర ఉగ్రవాదం నుంచి ప్రజల్ని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. అయితే, ఈ విన్నపాలను పట్టించుకోని కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలు సీపీఐ, ఆర్జేడీ, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, జేడీ (ఎస్) నేతల ప్రతినిధుల బృందం కశ్మీర్ పర్యటనకు వెళ్లింది. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, గులామ్ నబీ ఆజాద్, ఆనంద శర్మ, సీపీఐ నేత సీతారాం ఏచూరి, జేడీ (ఎస్) శరద్ యాదవ్, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, డీ రాజా, ఎన్సీపీ నుంచి మజీద్ మెమెన్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా ఇందులో ఉన్నారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన నేతలు విమానాశ్రయంలో మాట్లాడుతూ.. కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకోడానికే వెళ్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలించే ఉద్దేశం కాదని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడం లేదని, వారికి మద్దతుగానే వెళ్తున్నామని అన్నారు. అక్కడ పరిస్థితులను తెలుసుకుని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలన్నదే తమ అభిమతమని తెలిపారు