బిక్క బిక్కు మంటున్న పోలవరం ఏజెన్సీ గ్రామాల ప్రజలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బిక్క బిక్కు మంటున్న పోలవరం ఏజెన్సీ గ్రామాల ప్రజలు

ఏలూరు,  ఆగస్టు 7, (way2newstv.com)
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న 19 గ్రామాల ప్రజలు వరద భయంతో కొండలపై గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. పోలవరం వచ్చేందుకు ఏకైక మార్గంలో కొత్తూరు కాజ్‌వే నీట మునగడంతో వీరికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గతంలో గోదావరి వరద ప్రస్తుతాని కన్నా ఉధృతంగా వచ్చినా పెద్ద ఇబ్బంది వచ్చేది కాదు. పోలవరం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో వారి పరిస్థితి తలకిందులైంది. పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న నిర్వాసిత గ్రామాల్లో కొత్తూరు, కొండ్రుకోట, టేకూరు, చీడూరు, వాడపల్లి, కొత్త మామిడి గొంది గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ఆ గ్రామాల ప్రజలు కొద్ది రోజులుగా చీకట్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. 
 బిక్క బిక్కు మంటున్న పోలవరం ఏజెన్సీ గ్రామాల ప్రజలు

జనరేటర్లు, ఛార్జింగ్‌ లైట్లు, తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవడానికి బరకాలు కావాలని బాధితులు కోరినా వాటిని అందించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి మరింత పెరగడంతో కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకున్నారు. అసలే వర్షాకాలం, ఆపై వరద తాకిడికి విషసర్పాలు, కీటకాలు వస్తున్నాయని, విషకీటకాల వల్ల ఎప్పుడు ఎలాంటి హాని కలుగుతుందో అని భయాందోళనలతో నిర్వాసితులు తాత్కాలిక నివాసాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాగడానికి నీరు లేక ఎన్నో అవస్థలకు గురవుతున్నారు. దోమల బాధ ఎదుర్కోవాల్సి వస్తోంది. వర్షానికి తడిచిన కట్టెలతో వంట చేసుకోవడం సమస్యగా మారింది. కొత్తూరు, కొండ్రుకోట, మాదాపురం, వాడపల్లి గ్రామాల్లో మాత్రమే పర్యటిస్తున్న ఉన్నతాధికారులు ఎగువన ఉన్న గ్రామాల వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శివగిరి, సిరివాక, కొరుటూరు, తెల్లదిబ్బల గ్రామాల్లో గిరిజనులు సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు ఎగువ గ్రామాలకు సహాయక చర్యల నిమిత్తం అధికారులు చేరుకోవాలన్నా గోదావరి దాటి పురుషోత్తపట్నం వైపు నుంచి వెళ్లాల్సి ఉంది. గోదావరిపై లాంచీలు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాజమహేంద్రవరం మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి తగ్గినట్టే తగ్గి సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ పెరుగుతోంది. దీంతో, దేవీపట్నం మండలంలోని తొయ్యేరు, దేవీపట్నం, ఎ.వీరవరం, పూడిపల్లి, పోశమ్మగండి, అగ్రహారం గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. మరో 32 గ్రామాలకు వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. పూడిపల్లిలోకి వరద నీరు చేరడంతో 50 మంది బాధితులు గ్రామం పక్కనే ఉన్న కొండపై తలదాచుకున్నారు. తమకు సరిగా ఆహారం అందడంలేదని వాపోయారు. కోనసీమలో లంక గ్రామాల్లోకి వరద నీరు భారీగా చేరడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి కారణంగా ఉభయగోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న కనకాయిలంక, అయోధ్యలంక, పుచ్చల్లంక, సఖినేటిపల్లి మండలంలోని పెదలంక, అప్పనరామునిపాలెం లంక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి లంక, తొత్తరమూడి, పెదలంక, పొట్టిలంక, పొండికుదురులంక, చింతనలంక, మొండెపులంక, నాగుల్లంక, శివాయలంక లోతట్టు గ్రామాల్లోని వరద నీరు భారీగా చేరింది. గోదావరి వరద ఉధృతికి పోలవరం బోట్‌ పాయింట్‌ వద్ద ఆదివారం రాత్రి లంగరు వేసి కట్టి ఉంచిన రెండు లాంచీలు  తెల్లవారుజామున కొట్టుకుపోయాయి. లాంచీలో పనిచేస్తున్న కార్మికుడు అప్రమత్తమై బయటికి దూకి సురక్షితంగా బయటపడ్డాడు. సుమారు రూ.30 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు.దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాలు, రాజమహేంద్రవరం, కోనసీమలోని లంక గ్రామాలు ముంపులోనే కొనసాగాయి. భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద 12.90 అడుగుల నీటిమట్టాన్నీ స్థిరీకరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కాటన్‌ బ్యారేజీకి చెందిన 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 11.64 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పుడెల్టాకు నాలుగు వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1800 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో కాళేశ్వరం వద్ద 11.06 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 11.89, పేరూరు వద్ద 12.92 మీటర్లు, కుంట వద్ద 9.95 మీటర్లు, కూనవరం వద్ద 17.96 మీటర్లు, కోయిదా 22.80 మీటర్లు, పోలవరం వద్ద 13.08 మీటర్లు, రాజమహేంద్రవరం హేవలాక్‌ బ్రిడ్జి వద్ద 16.77 మీటర్లు నీటిమట్టం నమోదైంది.