మంచి రోజు...ముహుర్తాలు వచ్చినా.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మంచి రోజు...ముహుర్తాలు వచ్చినా....

ఇంకా ఆశలే
హైద్రాబాద్, ఆగస్టు 9, (way2newstv.com)
శ్రావణమాసం వచ్చినా…మంచి ముహూర్తాలు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టడం లేదు. ఎంతో మంది పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాదికి పైగానే పూర్తయింది. తొలిదశ మంత్రివర్గ విస్తరణలో కొందరికే అవకాశం కల్పించారు కేసీఆర్. పార్లమెంటు ఎన్నికలు ఉండటంతో ఆ ఎన్నికల తర్వాత మలి దశ విస్తరణ చేపడతామని తెలిపారు.తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావులకు కూడా కేబినెట్ లో చోటు దక్కలేదు. రెండో విడతలో వారికి స్థానం దక్కుతుందన్న వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఇప్పటి వరకూ కొడుకు, అల్లుడు మాజీ మంత్రులుగానే ఉండిపోయారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయాయి. 
మంచి రోజు...ముహుర్తాలు వచ్చినా....

తర్వాత స్థానిక సంస్థలఎన్నికలకు మంత్రివర్గ విస్తరణను ముడిపెట్టారు కేసీఆర్. అవికూడా పూర్తయ్యాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు మాత్రమే తెలంగాణలో మిగిలిపోయాయి.నిన్నటి వరకూ ఆషాఢం మాసం కావడంతో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం లేదని గులాబీ పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. గవర్నర్ నరసింహన్ ను కలిసేందుకు కేసీఆర్ వెళ్లినప్పుడల్లా మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చ జోరుగా సాగుతోంది. ఇక సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తలుహల్ చల్ చేస్తున్నాయి. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే అయినా ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి వర్గ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇందులో సబితా ఇంద్రారెడ్డి పేరు తొలి నుంచి విన్పిస్తుంది. ఈసారి కూడా మంత్రివర్గంలో మహిళలు లేకపోవడంతో ఖచ్చితంగా విస్తరణలో వారికి అవకాశం ఉంటుందని కేసీఆర్ శాసనసభలోనే ప్రకటించడంతో మహిళ ఎమ్మెల్యేలు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ కేసీఆర్ అందరినీ ఊరిస్తూనే ఉన్నారు. ముహూర్తం ఎప్పుడో చెప్పడం లేదు.