వ్యవసాయ పనుల్లో చింతమనేని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వ్యవసాయ పనుల్లో చింతమనేని

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే
ఏలూరు, ఆగస్టు 13, (way2newstv.com)
చింతమనేని ప్రభాకర్‌. ఈ పేరు దాదాపు ఏపీలో అందరికీ తెలిసిందే. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ప్రజా ప్రతినిధిగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి వరుసగా 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన చింతమనేని ప్రభాకర్‌ ఇప్పుడు ఏంచేస్తున్నారు? అదే దూకుడు ప్రదర్శిస్తున్నారా? లేక మౌనం వహించారా? ఏం చేస్తున్నారు? అనే విషయం రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. తాను ఎమ్మెల్యేగా ఉండగా చింతమనేని వేసిన చిందులు అన్నీ ఇన్నీ కావు. ప్రతి విషయంలోనూ ఆయన వేలు పెట్టేవారు. ప్రతి విషయాన్నీ చింతమనేని ప్రభాకర్‌ వివాదం చేసేవారు. 
వ్యవసాయ పనుల్లో చింతమనేని

ఏ చిన్న విషయంపైనా ఆయన అధికారులతో రగడకు దిగేవారు.ముఖ్యంగా ఇసుక మాఫియా విషయంలో ఏకంగా అప్పటి తహశీల్దార్‌ వనజాక్షిని కొట్టారనే చింతమనేని ప్రభాకర్‌ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక, ఎస్సీ వర్గానికి చెందిన ఓ కుటుంబాన్ని వేధించారనే ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి. అదే సమయంలో జనసేనాని పవన్‌పై తమ్ముడూ తమ్ముడూ అంటూనే తీవ్ర వ్యాఖ్యలు సంధించారు. ఇలా నిత్యం ఏదో ఒక విషయంతో మీడియాలో కనిపించేవారు చింతమనేని ప్రభాకర్‌. అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్‌, జ‌గ‌న్ ఇద్దరు వ‌చ్చి త‌న‌పై పోటీ చేసినా చిత్తుగా ఓడించి తీరుతాన‌ని శ‌ప‌థం చేశారు.అయితే, తాజాగా జరిగిన ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్‌ హవాకు బ్రేక్‌ పడింది. ఇక, మీరు మాకు అవసరం లేదు.. అంటూ.. దెందులూరు ప్రజలు ఇక్కడ వైసీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరికి పట్టం కట్టారు. దీంతో ఓటమిపాలైన చింతమనేని ప్రభాకర్‌ గత హవాను పక్కను పెట్టి కనీసం ఇప్పుడు మీడియాకు కూడా కనిపించకుండా పోయారు. అంతేకాదు, నాటి మెరుపులు ఇప్పుడు కనిపించడంలేదు. పైగా ప్రభుత్వంపై కానీ, లేదా సొంత పార్టీ టీడీపీ తరఫున కానీ చింతమనేని ప్రభాకర్‌ ఎక్కడా గళం వినిపించడం లేదు.అదే సమయంలో చింతమనేని ప్రభాకర్‌ తన ఇంట్లో కూర్చుని పాలు పితుక్కోవడం, పొలానికి వెళ్లి దూడలకు గడ్డి తీసుకురావడం, త‌న వ్యవ‌సాయ క్షేత్రంలో పండ్ల తోట‌లు పెంచుకోవ‌డం వంటి కార్యక్రమాలకు పరిమితమయ్యారు. గతంలో అభివృద్ధి కోసం కొంత మేరకు చింతమనేని ప్రభాకర్‌ కృషి చేసినా.. ఆయన ప్రతివిషయాన్నీ వివాదం చేసుకున్నారనే వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా వినిపించాయి. కానీ, ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుని మొత్తంగా మౌనం వహించడం, ఇంటికే పరిమితం కావడం చింతమనేని ప్రభాకర్‌లో మరో వ్యక్తిని పరిచయం చేసినట్టే అంటున్నారు విశ్లేషకులు.ఏదేమైనా.. తిరుగేలేదని తల విసిరిన నాయకుడు ఇప్పుడు తలదించుకుని తన పనిచేసుకుపోతుండడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు. అదే సమయంలో ఎవరైనా చింతమనేని ప్రభాకర్‌ వద్దకు వెళ్తే.. మీవల్లేనన్ను ప్రజలు చీదరించుకున్నారు. మీరు చేయమన్నట్టే చేశాను.కానీ, ఇప్పుడు ఓడిపోయాను అంటూవారిపై విరుచుకుపడుతున్నారు. ఏదైనా ముఖ్య కార్యక్రమాలకు కూడా చింతమనేని ప్రభాకర్‌ వెళ్లకుండా ఆయన తన సతీమణిని పంపుతున్నారు. మొత్తానికి ఒక్క ఓటమితో చింతమనేని మారారనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి.