గుంటూరు, ఆగస్టు 26 (way2newstv.com)
రాజధాని అమరావతిపై ప్రభుత్వంలో చర్చ నడుస్తోందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయమై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని.. బీజేపీ అధిష్టానమే తనకు చెప్పిందంటూ సంచలనానికి తెరదీశారు.
రాజధాని తరలింపుపై టీడీపీ నేతల ఫైర్
ఇప్పుడిదే విషయం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రాజధాని తరలింపు ఆలోచన సరికాదంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలు జగన్ సర్కార్‌పై మండిపడుతున్నారు. రాజధాని తరలించాలని చూస్తే ఆమరణ దీక్ష చేస్తానంటూ హెచ్చరించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీజీ వ్యాఖ్యలపై స్పందించారు. రాజధానిపై ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ ఎంపీ టీజీ వెంకటేష్ నాలుగు రాజధానుల వ్యాఖ్యలతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొందన్నారు. భిన్న ప్రకటనలు చేస్తూ అయోమయానికి గురిచేస్తున్నారంటూ మంత్రులు బొత్స, బుగ్గన, గౌతంరెడ్డిలపై మండిపడ్డారు. రాజధాని వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్.. కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు