పంట కాల్వల్లో వ్యర్థాలకు ప్రభుత్వం చెక్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పంట కాల్వల్లో వ్యర్థాలకు ప్రభుత్వం చెక్‌

విజయవాడ, ఆగస్టు13, (way2newstv.com)
ఇక పంట కాల్వల్లో వ్యర్థాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టనుంది. పారిశుధ్య సిబ్బంది, ప్రజలు చెత్తను పంట కాల్వల్లో, గట్లపై పడేస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. దీనికితోడు పలు గ్రామాల్లోని ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగాన్ని విస్మరించి బహిరంగ మలవిసర్జన చేస్తూ పంట కాల్వల్లోని సాగు, తాగు నీటిని కలుషితం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసేలా సర్కారు సమాయత్తమైంది. ఈ దిశగా తొలుత గ్రామాల్లో డంపింగ్‌యార్డుల కోసం స్థల సేకరణ పనులను రెవెన్యూ అధికారులు చేపట్టారు. పంచాయతీ పారిశుధ్య సిబ్బంది ఇంటింటా సేకరించిన చెత్తను తడి, పొడిచెత్తగా వేరు చేయనున్నారు. తడి చెత్తను డంపింగ్‌యార్డులో ఏర్పాటు చేసే వర్మీ కంపోస్టు యార్డుల ద్వారా ఎరువులుగానూ, పొడి చెత్తను విక్రయాలు జరిపేలా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. 
పంట కాల్వల్లో వ్యర్థాలకు ప్రభుత్వం చెక్‌

దీని నిమిత్తం గ్రామానికి రూ.రెండు వేలు, రూ.ఐదు వేల వరకూ నిధులు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మండలంలో నమూనా ప్రాజెక్టుగా రూ.75 లక్షలతో లంకలకోడేరులో డంపింగ్‌యార్డును నిర్మించి తడి, పొడి చెత్త వేరు చేసేలా అరలను నిర్మించారు. దీంతో వర్మీ కంపోస్టు యార్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. త్వరలోనే ఇది ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా పంట కాల్వల పరిశుభ్రతతో స్వచ్ఛ నీరు, డంపింగ్‌యార్డుల ద్వారా స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మండలంలోని రాపాక ఛానల్‌ ఆనుకుని ఎస్‌ చిక్కాల, లంకలకోడేరు, గవరపేట పంట కాల్వలు, భగ్గేశ్వరం కాల్వ, దిగమర్రు ఛానల్‌, నరసాపురం పంట కాల్వల పరిస్థితి తీవ్రంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.పంట కాల్వల్లో వ్యర్థాలు వేయకుండా నివారించేందుకు ప్రభుత్వం కొందరు అధికారులను బాధ్యులను చేయనుంది. మండల అభివృద్ధి, తహశీల్దార్‌, జలవనరులు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులకు వీటి పర్యవేక్షణను అప్పగించనుంది. ఆయా అధికారులు పర్యవేక్షించి వ్యర్థాలతో పంటకాల్వల్లోని జలాలు కలుషితం చేయకుండా చర్యలు చేపట్టనున్నారు. దీంతోపాటు పంటకాల్వ సమీప గృహ నివాస ప్రజలకు, పంచాయతీ పాలకవర్గాలకు అవగాహనా సదస్సులు నిర్వహించి చెత్తను పంటకాల్వలో వేయకుండా చైతన్యపర్చనున్నారు. దీంతో పాటు ఇటీవల ఎంపికైన నీటి వినియోగదారుల సంఘ సభ్యులను సమన్వయం చేసుకుని పంట కాల్వల్లో తూడు తొలగింపు, గట్లపై పేరుకుపోయే పిచ్చిమొక్కలు, చెత్తను తొలగింపు చర్యలు చేపట్టనున్నారు.