శ్రీనగర్ ఆగష్టు 8 (way2newstv.com):
కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ గురువారం జమ్ముకశ్మీర్ వెళ్లారు ఆర్టికల్ 370 రద్దుపై జమ్ముకశ్మీర్‌లోని కాంగ్రెస్ నేతలు, ప్రజలతో సమావేశమయ్యేందుకు ఆజాద్ నేడు అక్కడకు వెళ్లారు. ‘జమ్ముకశ్మీర్ ప్రజలు విచారంలో ఉన్నారు. వారి బాధను పంచుకునేందుకు నేను వెళ్తున్నాను’ అని ఆజాద్ దిల్లీలో బయల్దేరే ముందు విలేకరులతో అన్నారు. ఆజాద్‌తో పాటు జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్ మధ్యాహ్నం సమయంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
అయితే రాష్ట్రంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో వీరిని విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా శ్రీనగర్ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆజాద్‌ను విమానాశ్రయం నుంచే తిరిగి దిల్లీకి పంపించనున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తీర్మానాలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్రంలో నిషేదాజ్ఞలను అమల్లోకి తీసుకొచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా 500 మందికి పైగా రాజకీయ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. వీరందరినీ శ్రీనగర్‌లోని షేర్ ఏ కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం, బారాముల్లా, గురెజ్‌లలోని పలు తాత్కాలిక కేంద్రాల్లో ఉంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Tags:
all india news