అన్నయ్య సన్నిధి ...తోబుట్టువులకు పెన్నిధి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నయ్య సన్నిధి ...తోబుట్టువులకు పెన్నిధి

నేడు రాఖీ పౌర్ణమి
ఒక కొమ్మకు పూసిన పువ్వులం, అనురాగం మనదేలే.... ఒక గూటిన వెలిగిన దివ్వెలం, మమకారం మనదేలే.... అని అన్నా చెల్లెళ్లు మనసారా పాడుకునే రక్షా బంధన్‌ రానే వచ్చింది. సంబరాలు, ఆత్మీయతానురాగాలను మోసుకొచ్చింది. శ్రావణ శుద్ధ పౌర్ణమిన జరుపుకునే ఈ పండుగ ప్రస్తుతం ఆధునీకతను సంతరించుకుంది. భారీ స్థాయిలో ఉన్న పువ్వుల రాఖీలు ఓల్డ్‌ ప్యాషన్‌గా భావిస్తున్న యువతరం నేడు ప్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లను పోలిన ఆధునిక రాఖీలను కొనుగోలు చేస్తోంది.అక్కా-చెల్లెళ్లకు అభిమానం, అనురాగం, ఆప్యాయతను పంచుతూ కష్టనష్టాల్లో, సుఖసంతోషాల్లో మేము మీకు అండగా ఉన్నామంటూ భరోసాను సోదరులకు కల్పించేదే రక్షాబంధన్‌. 
అన్నయ్య సన్నిధి ...తోబుట్టువులకు పెన్నిధి

అయితే, ప్రస్తుతం బాంధవ్యాలకు అర్థం లేకుండా పోతోంది. వీటి మూలాలు సరిపెట్టే వేదికలే పండుగలు. అటువంటి వాటిలో శ్రావణ పౌర్ణమి...రక్షాబంధన్‌ ప్రాముఖ్యత అనన్యం. సంప్రదాయం మాటున దాగిన రాఖీ పౌర్ణమి ప్రతి ఏటా దేశవ్యాప్తంగా శ్రావణ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీ.తోబుట్టువుల బంధానికి ఎల్లలు అడ్డురావు. ఒకే రక్తం పంచుకు పుట్టిన వారు విడివిడిగా ఎక్కడ ఉన్నా వారి మనసులు మాత్రం దగ్గరగానే ఉంటాయి. ఇలాంటి వారి కోసమే రాఖీ పండుగ వేదికగా నిలుస్తోంది. ఈ వేళ చెల్లెళ్ల అనురాగ బంధం... అక్కా తమ్ముళ్ల అనుబంధం అపురూపం. తన మీద అమ్మకు చాడీలు చెప్పినా ఆ చెల్లెలంటే అన్నకు ప్రాణమే. తన అల్లరితో చికాకు పెడుతున్నా... ఆ తమ్ముడంటే అక్కకు అంతులేని అనురాగమే. వీరు చేసే అల్లరిలో ఆత్మీయత, ఐక్యత ఉంటుంది. అందమైన అనుభూతి ఉంటుంది.
ఇప్పుడంతా ఆన్‌లైన్‌ మయం
గతంలో ఎక్కడో ఉన్న సోదరుడికి రాఖీ పంపించాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అన్‌లైన్‌లో రాఖీని బుక్‌ చేసి చిరునామా రాస్తే సరిపోతుంది. సోదరుడికి తపుపు తట్టి మరీ రాఖీని అందించే సంస్థలు చాలా వచ్చాయి. నగరాల్లో ఇది ఇలా ఉంటే పల్లెవాసులు అయితే ప్రత్యేకంగా సోదరుల దగ్గరకు వెళ్లి రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకుంటారు. నాకు నీవు రక్షా- నీకు నేను రక్షా... అంటూ రాఖీ కట్టి తమ ఆత్మీయత బాంధవ్యాన్ని వ్యక్తపరుస్తుంటారు. సోదరీసోదరుల ఆత్మీయత బాంధవ్యానికి ప్రతికే రక్షాధారణం. చిలిపితనం, పెంకితనం, అనురాగం, అభిమాన ప్రేమ, ఆప్యాయతలకు అద్దంపట్టే ప్రేమాప్యాయతలు అమరం, అజరామరం. అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లు కట్టే రాఖీ.. రక్షా బంధన్‌ ఎప్పటి నుంచో మన సంప్రదాయంలో ఓ భాగం.మమతానురాగాలకు ప్రతీక. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌...ఎలా పిలిచినా  పెల్లుబికే ఆనందం ఒక్కటే. మానస వీణ తంత్రులను స్పృశించే తీరు ఒక్కటే. అన్నా చెల్లెళ్ల తోబుట్టువుల అనుబంధం చాలా పవిత్రమైనది.. చెల్లెళ్లు మన ఇంటికి వచ్చి రాఖీ కట్టాలనే ధోరణికి భిన్నం. రాఖీ పండుగ నాడు చెల్లెళ్లు చూపించే అభిమానం, ఆత్మీయత, అనురాగం మరవలేనిది.అమ్మ ఒడిలో పుట్టి... నాన్న సంరక్షణలో పెరిగి.... ఒకరికొకరు ప్రేమానురాగాలు పంచుకునే అన్నా చెల్లెళ్ల పండుగ రక్షాబంధన్‌. సోదరీ సోదరుల ఆత్మీయత బాంధవ్యానికి ప్రతీకగా నిలిచే రక్షాధారణ అన్నా చెల్లెళ్ల మమకారం మరచిపోకుండా ఉండటానికి ఏడాదికొకసారి గుర్తుకు తెస్తోంది.పాశ్చాత్య సంసృతి దిగుమతి అవుతున్న సందర్భంలో మన ఆచార వ్యవహారాలు, సంసృతి సంప్రదాయాలను మరచిపోకుండా పండుగలు గుర్తు చేస్తాయి. మన భారతీయ సంసృతి ఇతర దేశాలకు స్ఫూర్తి దాయకం. అలాంటి గొప్ప ఔన్నత్యాన్ని విశిష్టతలను చాటి చెప్పే పండుగలకు సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఎంతైనా అవసరం. రాఖీ పండుగ అన్నా చెల్లేళ్ల ఆత్మీయతానుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.