కొత్తపల్లి సుబ్బరాయుడు కుమారుడు మృతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొత్తపల్లి సుబ్బరాయుడు కుమారుడు మృతి

ఏలూరు, ఆగస్టు 19 (way2newstv.com)
మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడి చిన్న కుమారుడు నారాయణ రాయుడు (35) సోమవారం మృతిచెందారు. చంటిబాబూ అని ముద్దుగా పిలుచుకునే నారాయణ రాయుడు పుట్టుకతోనే మానసికలోపంతో బాధపడుతున్నాడు. అతడికి చికిత్స అందజేస్తూ వీల్‌చైర్‌‌ సాయంతోనే సాకుతున్నారు.మధ్యాహ్నం వీల్‌చైర్‌లో ఉన్న చంటిబాబు ఒక్కసారి కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే నారాయణ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో చంటిబాబు భౌతికకాయాన్ని రుస్తుంబాదలోని తన నివాసానికి తరలించారు. కుమారుడి భౌతికకాయం చూసి సుబ్బారాయుడు దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 
కొత్తపల్లి సుబ్బరాయుడు కుమారుడు మృతి

వారి కన్నీటి వేదనను చూసి అక్కడవారు చలించిపోయారు. కుమారుడు చంటిబాబు అంటే సుబ్బారాయుడుకు అమితమైన ప్రేమ అని చెప్పుకుంటారు. గత 35 సంవత్సరాలుగా కుమారుడి కోసమే సుబ్బారాయుడు సతీమణి పూర్తి సమయాన్ని కేటాయించారు. చంటిబాబు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చంటిబాబు మరణవార్త తెలియడంతో కొత్తపల్లిని ఓదార్చడానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం రుస్తుంబాద చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్‌ ఎండీ షరీఫ్, ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, జక్కంపూడి రాజా, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, కొత్తపల్లి జానకిరామ్, తదితరులు కొత్తపల్లి పరామర్శించి, చంటిబాబుకి నివాళులర్పించారు. 1989 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తపల్లి సుబ్బారాయుడు, వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీలో చేరిన ఆయన.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి మరోసారి పోటీచేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమిచవిచూశారు. తర్వాత టీడీపీలో చేరినా, ఇటీవల ఎన్నికల ముందు వైసీపీ గూటికి చేరారు. చంద్రబాబు మంత్రివర్గంలో కొత్తపల్లి విద్యుత్తు శాఖ మంత్రిగా పనిచేశారు.