ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్న టీడీపీ బాస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్న టీడీపీ బాస్

కొత్త బంధాల దిశగా అడుగులు
విజయవాడ, ఆగస్టు 24, (way2newstv.com)
కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ. అదే చంద్రబాబు అయితే కాదేదీ రాజకీయానికి అనర్హం అని మార్చి చదువుకుంటారు. బాబు రాజకీయాల్లో వాడని రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరూ లేరన్నది వాస్తవం. నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ని కూడా మిత్ర పక్షం చేసేసుకుని తాను ఎక్కడ నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళి మరీ పునాది గట్టి పరచుకున్నారు. ఇక చంద్రబాబు ఈ మధ్య వైఎస్సార్ పేరుని కూడా వాడుకునేందుకు అసెంబ్లీ వేదికగా ప్రయత్నించిన సంగతి విదితమే. తాను వైఎస్సార్ ఒకే మంచం, ఒకే కంచం దోస్తులమని చెప్పుకుని ఫ్యాన్ గాలిని కాసింత తనవైపు తిప్పుకోవాలని ఆశపడ్డారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం అపుడే ప్రయత్నాలు మొదలెట్టెసినట్లుగా కనిపిస్తోంది. 
ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్న టీడీపీ బాస్

ఇందులో భాగంగా ఆయన ప్రతి అవకాశాన్ని, సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి దాదాపుగా రిటైర్ అయ్యారనే అనుకోవాలి. ఆయన సినిమాలు చేసుకుంటూ తీరిక లేకుండా ఉన్నారు. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో కూడా రాజకీయాల గురించి కొంత నెగిటివ్ గా మాట్లాడారు. తన బరువు బాగా పెరిగి శరీరం మీద నియంత్రణ కోల్పోయింది రాజకీయాల్లోనేనని కూడా అన్నారు మెగాస్టార్. అటువంటి చిరంజీవి పుట్టిన రోజుకు విషెస్ ప్రత్యేకంగా పనిగట్టుకుని మరీ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చెప్పడం విశేషపరిణామంగానే చూడాలి. చిరంజీవికి ఎపుడూ అందే బర్త్ డే విషేస్ కి ఇవి స్పెష‌ల్ అన్నమాట. బాబు అయిదేళ్ళు సీఎంగా ఉన్నపుడు కానీ అంతకు ముందు కానీ ఇలా ఎపుడూ మెగాస్టార్ కి విషేస్ చెప్పింది లేదు. ఈసారి మాత్రం చిరుతో కలసి తాను ఉన్న పాత ఫోటోను ఒకదాన్ని షేర్ చేసి మరీ ట్విట్టర్లో బాగానే మెగా గ్రీటింగ్స్ పంపారు. అదే పని చినబాబు కూడా చేశారు. మరి మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ చెప్పడంలో ఆంతర్యం ఏంటన్న చర్చ సాగుతోంది. రాజకీయ లాభం లేకపోతే బాబు ట్విట్టర్ కి కూడా పని చెప్పరన్నది తెలిసిందే.చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా ఆయన సోదరుడు పవన్ జనసేనతో ఉన్నారు. మరి పవన్ నిన్నటి వరకూ బాబుకు మిత్రుడే. ఇపుడు కాస్తా ఎడబాటు కలిగింది. మళ్లీ పవన్ ని తన గూటికి తెచ్చుకోవడానికి చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్న సంగతి విదితమే. జనసేనకు చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుని అరెస్ట్ చేసిన సందర్భంగా చంద్రబాబు, చినబాబు జగన్ ని, ప్రభుత్వాన్ని తిడుతూ పవన్ కి మద్దతుగా నిలిచారు. అలా ఓ సిగ్నల్ అపుడే వెళ్లింది. ఇపుడు మళ్ళీ మెగాస్టార్ ని గ్రీట్ చేయడం ద్వారా తాము అటువైపు ఉన్నామని చెప్పడానికి ప్రయత్నించారు. మరి కొద్ది రోజుల్లో పవన్ బర్త్ డే కూడా వస్తుంది, అపుడు కూడా విషెస్ ఇలాగే చెబుతారనుకోవాలి. ఇక మెగా ఫ్యామిలీ మద్దతు కోసం ముందు ముందు ఏం చేయాలో చేస్తారన్నది కూడా తెల్సిపోతోంది. అయితే పవన్ సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. టీడీపీతో కలుస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబు కన్ను గీటుడుకు పడిపోయే వారే కానీ కాదనే వారు ఇంతవరకూ రాజకీయాల్లొ ఎవరూ లేరు. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో పోటీ చేసినపుడు నానా తిట్లు తిట్టి, తన అనుకూల మీడియాతో తిట్టించి జెండా పీకేసే వరకూ నిద్రపోని నైజం చంద్రబాబుదన్న ప్రచారం ఉంది. అంతే కాదు అప్పట్లో చంద్రబాబు ప్రతీ మీడియా మీటింగులోనూ చిరంజీవి వల్లనే తాను ఓడిపోయానని చెప్పుకున్నారు. ఇపుడు అదే చిరంజీవికి గ్రీట్ చేస్తున్నారు. ఇదే కదా అసలైన రాజకీయమంటే మరి.