అమరావతిలో వైసీపీ కొత్త కార్యాలయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమరావతిలో వైసీపీ కొత్త కార్యాలయం

విజయవాడ, ఆగస్టు 10 (way2newstv.com)
అమరావతి కేంద్రంగా వైసీపీ కార్యకలాపాలు మొదలయ్యాయి. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రారంభమయ్యింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాలయ్యాన్ని ప్రారంభించారు. అనంతరం ఆఫీసులోని తన ఛాంబర్‌లో ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు.. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 
 అమరావతిలో వైసీపీ కొత్త కార్యాలయం

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆఫీసులో అన్ని హంగులు దిద్దారు. బ్యాక్ ఆఫీస్, సోషల్ మీడియా విభాగం, మీడియా కోఆర్డినేషన్ ఇలా పార్టీకి చెందిన విభాగాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచే పనిచేస్తాయి. ప్రెస్‌మీట్లు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇకపై ఇక్కడే నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్‌ కేంద్రం పార్టీ కేంద్ర కార్యాలయం ఉండేది. కానీ ఎన్నికల సమయంలో పార్టీ కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేశారు. ముందు తాడేపల్లిలోని జగన్ నివాసంలోనే పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే దాన్ని క్యాంప్ ఆఫీసుగా ఉపయోగిస్తుండటంతో.. ప్రత్యేకంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలని జగన్ పార్టీ నేతల్ని ఆదేశించారు. జగన్ ఆదేశాలతో పార్టీ నేతలు కొత్త భవనం కోసం వెతికారు. ఈలోపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన నేతకు సంబంధించిన భవనం నిర్మాణంలో ఉంది. దీంతో ఆయన్ను ఒప్పించి ఆ భవనాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చేశారు. చుట్టూ అద్దాలతో, పచ్చదనంతో.. ఆధునిక హంగులతో భవనాన్ని తీర్చదిద్దారు. ఇవాళ అధినేత జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు.