నిలువెత్తు సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ సుష్మా స్వరాజ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిలువెత్తు సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ సుష్మా స్వరాజ్

కట్టుబొట్టులతో ఆకట్టుకొనే ప్రసంగాలు
25 ఏళ్లకే హర్యానా మంత్రి
ఏడు సార్లు ఎంపీగా బాధ్యతలు
చిన్నమ్మకు దేశ, విదేశాల్లో అభిమానులు 
బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూసిన విషయం తెలిసి దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన అనర్గల ప్రసంగాలతో, సంప్రదాయమైన కట్టుబొట్టుతో భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు సుష్మా. ఇందిర తర్వాత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనతకెక్కిన చిన్నమ్మ.. ఆ పదవికే వన్నె తెచ్చారు. కేవలంలో భారతీయులే కాదు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌ వాసులు సైతం ఆమె అభిమానగణంలో ఉన్నారు. 
 నిలువెత్తు సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ సుష్మా స్వరాజ్ 
భారత్‌కు అత్యవసర వైద్యం కోసం వచ్చే పాకిస్థానీలకు ఆమె చేసిన సాయం వారు జీవితాంతం మరిచిపోలేరు. సుష్మా చేసిన సాయానికి పాక్‌వాసులకు ఆమె పట్ల ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. దీనికి రెండేళ్ల కిందట ఓ మహిళ చేసిన ట్వీటే నిదర్శనం. బీజేపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సుష్మాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని పలువురు నేతలు భావోద్వేగానికి గురవుతున్నారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసిందంటూ ప్రధాని మోదీ భావోద్వేగపూరిత ట్వీట్లు చేశారు. సుష్మాజీ అస్తమయం చెందడం వ్యక్తిగతంగా నాకు ఎంతో లోటు. దేశానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. సుష్మాను అభిమానించే వారికి ఇది ఎంతో దురదృష్టకరమైన పరిస్థితి. నా ఆలోచనలన్నీ సుష్మా కుటుంబసభ్యులతోనే ఉంటాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసింది. ప్రజాసేవ, పేదల అభ్యున్నతి కోసమే సుష్మాజీ తన జీవితాన్ని అంకితం చేశారు. దేశం కోసం సుష్మా చేసిన ప్రతి పనిని ప్రజలు గుర్తించుకుంటారు. సుష్మా స్వరాజ్‌ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు’ అని ప్రధాని మోదీ కొనియాడారు. 
సుష్మా స్వరాజ్ ఒక మంచి వక్త, మంచి పార్లమెంటేరియన్ అని ప్రధాని మోదీ కీర్తించారు. పార్టీలకు అతీతంగా ఆమె అభిమానులను సంపాదించుకున్నారని పేర్కొన్నారు. జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతాల కోసమే పనిచేశారని.. ఎలాంటి పరిస్థితులకూ లొంగలేదని వెల్లడించారు. బీజేపీ కోసం ఆమె ఎంతో చేశారని మోదీ తెలిపారు. గడిచిన ఐదేళ్లలో విదేశాంగ మంత్రిగా సుష్మాజీ అలుపెరగకుండా పనిచేసిన విధానాన్ని నేను మరచిపోలేను. తాను అనారోగ్యానికి గురైన సందర్భాల్లోనూ తన విధులకు న్యాయం చేయడానికి చేయాల్సిందంతా చేశారు. తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె చూపిన చొరవ, నిబద్ధత అనితరసాధ్యం’ అని మోదీ ట్వీట్ చేశారు. 
సోనియాను అడ్డుకున్న నేతగా గుర్తింపు
విద్యార్థి దశ నుంచి రాజకీయాలవైపు ఆకర్షితురాలైన సుష్మా.. సుప్రీం లాయర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. 25 ఏళ్లకే హర్యానా మంత్రిగా పని చేశారు. ఏడుసార్లు ఎంపీగా పని చేశారు. 1999లో ఆమె కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సోనియా గాంధీని ఎదుర్కొనేందుకు బీజేపీ సుష్మాను ప్రధానాస్త్రంగా ప్రయోగించింది. 1999 లోక్ సభ ఎన్నికల్లో సోనియా బళ్లారి నుంచి పోటీ చేయగా.. బీజేపీ సుష్మా స్వరాజ్‌ను ఆమెకు ప్రత్యర్థిగా నిలిపింది. విదేశీ కోడలికి, స్వదేశీ కూతురికి మధ్య పోటీగా బళ్లారి ఎన్నికను కమలనాథులు అభివర్ణించారు. ఆ ఎన్నికల్లో సోనియా సుష్మాను 56 వేల ఓట్ల తేడాతో ఓడించారు. కానీ కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో సుష్మా కాంగ్రెస్ అధినేత్రికి ధీటుగా ప్రచారం నిర్వహించారు. నుదుటున పెద్ద బొట్టు, చీరకట్టుతో అచ్చమైన భారత నారిగా సుష్మా ప్రజల మదిలో నిలిచిపోయారు. బీజేపీ సుష్మాను ఆదర్శ భారత మహిళగా అభివర్ణించింది. ఆ ఎన్నికల సమయంలో బళ్లారి మైనింగ్ వ్యాపారి, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి సుష్మా స్వరాజ్‌ తరఫున నిలిచి ఆమె అభిమానం చూరగొన్నారు. 1999 ఎన్నికల్లో సోనియా, సుష్మా ప్రత్యర్థులుగా తలపడ్డారు. కానీ వీరిద్దరి మధ్య వైరం తర్వాత కూడా కొనసాగింది. 2004 ఎన్నికల్లో యూపీఏ పక్షం మెజార్టీ సాధించింది. దీంతో సోనియా ప్రధాని పగ్గాలు చేపట్టాలని యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలు కోరారు. సోనియా ప్రధాని పీఠం మీద కూర్చుంటే.. తాను గుండు కొట్టించుకొని, తెల్ల చీర కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తానని సుష్మా స్వరాజ్ సంచలన ప్రకటన చేశారు. బ్రిటిషర్ల పాలన ముగిసినా కూడా.. సుదీర్ఘ పోరాటం అనంతరం దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా భారతీయులు ఇటలీలో జన్మించిన సోనియాను ప్రధానిగా ఎన్నుకోవడం ఏంటని సుష్మా ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా ప్రధానిగా పగ్గాలు చేపట్టడం తనకు సమ్మతం కాదన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో సోనియా గాంధీ ప్రధాని పదవి తనకు వద్దని ప్రకటించాల్సి వచ్చింది. 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా సోనియా, సుష్మా మాటలు కలిపారు. వీరిద్దరూ చీరల గురించి చర్చించుకున్నారు. మరుసటి ఏడాది సుష్మా కామన్వెల్త్ ప్రసంగాన్ని సోనియా ప్రశంసించారు. 2014లో పార్లమెంట్‌లో సోనియా నాయకత్వంపై సుష్మా పొగడ్తలు గుప్పించారు. కానీ ఆ తర్వాత వీలైనప్పుడల్లా రాహుల్ గాంధీని విమర్శించడానికి సుష్మా వెనుకాడలేదు. సుష్మా నాటకాలు వేయడంలో నిపుణురాలంటూ సోనియా చురకలు అంటించారు.
ఇద్దరు మహిళా నేతలు..అంతలోనే
జాతీయ స్థాయిలో ఉత్తమ నేతలుగా గుర్తింపు పొందిన ఇద్దరు మహిళా నాయకురాళ్లు రెండు వారాల వ్యవధిలో కన్నుమూయడం దేశ రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది. ఆ ఇద్దరూ గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పంచినిచేసిన షీలా దీక్షిత్, సుష్మాస్వరాజ్. షీలా కంటే 14ఏళ్లు చిన్న వారైన సుష్మా స్వరాజ్ అమె కంటే ముందే ఢిల్లీ సీఎం పీఠం మీద కూర్చున్నారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుష్మ 40 రోజుల్లోగా ఈ పీఠం దిగాల్సి వచ్చింది. ఆకస్మాతుగా పెరిగిన ఉల్లిగడ్డల ధర ఆమె ప్రభుత్వాన్ని దించేశాయి, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన షీలా దీక్షిత్ 2013 వరకు 15ఏళ్ల పాటు పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన షీలా జులై 20వ తేదీన కన్నుమూశారు. దీంతో తామంతా పెద్దదిక్కును కోల్పోయామంటూ కాంగ్రెస్ శ్రేణులు కన్నీరు పెట్టుకున్నాయి. ఇప్పుడు సుష్మా స్వరాజ్ మృతితో బీజేపీ నేతలు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సమయంలో ఈ చిన్నమ్మను మరిచిపోవద్దంటూ ప్రజలకు ఆమె చేసి విన్నపాన్ని అందరూ మననం చేసుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అయితే సుష్మా స్వరాజ్ భౌతికకాయాన్ని చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎన్డీయే ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన ఆపదలో ఆదుకునే అమ్మగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. భారతీయులెవరైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపదలో ఉన్నామంటూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు ఆమె వెంటనే స్పందించేవారు. వీసా రాక ఇబ్బంది పడే వారు, విదేశాలకు వెళ్లి పాస్‌పోర్టు పోగొట్టుకున్నవారు, వైద్యం కోసం భారత్‌కు వచ్చే విదేశీయులు.. ఇలా ఎవరైనా సరే తమ సమస్యలను ఆమె దృష్టికి తెస్తే వెంటనే స్పందించి పరిష్కరించేవారు