కమిషనర్ దానకిషోర్
హైదరాబాద్ ఆగష్టు 2 (way2newstv.com)
జవహర్‌నగర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ పనులను నిర్ధేశిత కాల వ్యవధిలో పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ రాంకీ అధికారులను ఆదేశించారు. జవహర్‌నగర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ పనులు, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఇ.పి.టి.ఆర్.ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ్ చక్రవర్తి, అడిషనల్ కమిషనర్ శృతిఓజా, ఎస్.ఇ కోటేశ్వరరావు, రాంకీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద డంప్‌యార్డ్ క్యాపింగ్ పనులను జవహర్‌నగర్‌లో చేపట్టామని, ఈ క్యాపింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
జవహర్‌నగర్ క్యాపింగ్ పనులను మరింత వేగవంతంగా చేయాలి
అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల క్యాపింగ్ పనులకు అంతరాయం ఏర్పడుతోందని, అయినప్పటికీ రోజుకు దాదాపు 300 మంది వర్కర్లతో పనులను చేపట్టామని రాంకీ ప్రతినిధులు తెలిపారు. డంప్‌యార్డ్ నుండి వెలువడే వ్యర్థ ద్రవాల (లీచెట్) శుద్దికై ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ మరో రెండు రోజుల్లో పనిచేయడం ప్రారంభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. కాగా జీడిమెట్లలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ పనిచేస్తుందని, ఈ ప్లాంట్‌ను ఆగష్టు 15వ తేదీన ప్రారంభించేందుకు సిద్దంగా ఉండాలని యూనిట్ నిర్వహకులకు కమిషనర్ ఆదేశించారు. ప్రస్తుత భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలన్నింటికి జి.పి.ఎస్ విధానాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ఫతుల్లాగూడలో ప్రతిపాదిత సి అండ్ డి ప్లాంట్‌కు సంబంధించి అగ్రిమెంట్ ను పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు. కాగా నగరంలో భవనాలను జి.ఐ.ఎస్ మ్యాపింగ్ చేపట్టే ప్రణాళికపై నేడు సాయంత్రం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అద్వైత్ కుమార్ సింగ్, సిక్తాపట్నాయక్, కెనడి, సిసిపి దేవేందర్‌రెడ్డి, సి.ఇ జియాఉద్దీన్, తెలంగాణ రిమోట్ సెన్సింగ్, డెవలప్‌మెంట్ ఏజెన్సీ అధికారులతో కమిషనర్ దానకిషోర్ విస్తృతంగా చర్చించారు.
Tags:
telangananews