న్యూఢిల్లీ ఆగష్టు 1 (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ముమ్మారు తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ట్రిపుల్ తలాక్ బిల్లు ఫైల్ పై ఆయన సంతకం చేశారు. రాష్ట్రపతి దీనిపై ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
దీంతో ప్రస్తుతమున్న ఆర్డినెన్సు స్థానంలో చట్టం వచ్చేసింది. నిజానికి ముమ్మారు తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే తీర్పునిచ్చినా, ఇంకా అది కొనసాగుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ చట్టం విషయంలో ముందడుగు వేసింది. అదే ఏడాది డిసెంబరులో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభలో ఆమోదం పొందినా, రాజ్యసభలో తగిన బలంలేక అప్పటికి వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో మరోసారి ఈ బిల్లును తీసుకొచ్చింది. జులై 25న లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును జులై 30న రాజ్యసభ ముందుకు తీసుకొచ్చారు. పెద్దల సభలో ఎన్డీయేకు తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. కొన్ని పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం, మరికొన్ని పార్టీలు వాకౌట్ చేయడం ప్రభుత్వానికి కలిసొచ్చాయి. దీంతో 99 ఓట్ల తో తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. తాజాగా రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఈ చట్టాన్ని ఉల్లఘించినవారికి మూడు ఏళ్ల దాక జైలు శిక్ష పడే అవకాశం వుంది.
Tags:
all india news