నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల

నల్గొండ, ఆగస్టు 12  (way2newstv.com):
రాష్ట్రంలో సరిగ్గా దశాబ్దం తర్వాత కృష్ణా, గోదావరి, వంశధార నదులు పోటాపోటీగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆగస్టు 11వ తేదీ నాటికే నదీ పరీవాహక ప్రాంతంలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా, వంశధార నదుల్లో సెప్టెంబరు వరకూ.. గోదావరి నదిలో అక్టోబర్‌ వరకూ వరద ప్రవాహం ఉంటుంది. రుతుపవనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురిస్తే పెన్నా నది కూడా పొంగుతుంది. వర్షాలు ఇలాగే కొనసాగితే మధ్య తరహా ప్రాజెక్టులు సైతం నిండుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2009 తర్వాత జీవనదులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకోవడంతో సింహభాగం ప్రాజెక్టుల కింద ఆయకట్టులో ఖరీఫ్, రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఇప్పటికే గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాలో 13.09 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. వంశధార నది పోటెత్తుతుండటంతో గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 25.53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఉత్తరాంధ్రలో నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో తోటపల్లి జలాశయం నిండిపోయింది. తోటపల్లి జలాశయం కింద ఉన్న ఆయకట్టు 1.18 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 10.38 లక్షల ఎకరాలకు ఆదివారం ఆంధ్రపదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్, తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు ఆగస్టు రెండో వారంలోగా నీటిని విడుదల చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరద నీటితో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం నిండటంతో నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో చానాళ్ల తర్వాత సాగర్ జలకళతో మురిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు క్రమంగా ప్రాజెక్టులో చేరడంతో సోమవారం ఉదయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లోకి శనివారం 3.94క్యూసెక్కుల నీరు రాగా..  అది 7.57క్యూసెక్కులకు చేరింది. దీనిబట్టి రోజుకు దాదాపు 55-60 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వస్తున్నట్లు లెక్కగట్టారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 543.80అడుగులకు చేరింది. గతేడాది సెప్టెంబరు నెలలో పులిచింతలకు నీటిని విడుదల చేయగా.. ఈసారి ఆగస్టు రెండో వారంలోనే నీటిని విడుదల చేస్తున్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం కేవలం 44 టీఎంసీలు మాత్రమే. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో ఈ ప్రాజెక్టు ఒక్కరోజులోనే నిండనుంది. సోమవారం రాత్రికి ప్రాజెక్టు నిండుతుందని, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. గువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 7.53లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 8.51 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జలాశయం 10 గేట్లను 42 అడుగుల మేర పైకెత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాలద్వారా 8,20,162 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకి 28వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.