శుభప్రదం... శ్రావణమాసం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శుభప్రదం... శ్రావణమాసం

హైద్రాబాద్, ఆగస్టు 7  (way2newstv.com)
శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు.ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితోపాటు గరుడ పంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషి పంచమి, గోవత్స బహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.శ్రావణం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం.
శుభప్రదం... శ్రావణమాసం

చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మళ్లించి మానసిక ప్రశాంతత పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్యోద్దేశం. సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. ఈ మాసంలో రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దీర ్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే.  ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఉపవాసం ఉండ గలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ మాసం దీనిని ఒక వ్రతంగా పెట్టుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయి.
వరాలనిచ్చే...వరలక్ష్మీ
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు జరపుకుంటారు. ఈ వ్రతం వల్ల లక్ష్మిదేవి అనుగ్రహం దక్కి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా కొత్త కోడళ్లతో అత్తవారింటి ఈ వ్రతాన్ని చేయించడం విశేషం. ఒకనాడు పరమేశ్వరుడు మహానందంలో ఉన్న సమయంలో పార్వతీదేవి.. స్త్రీలుసర్వసౌఖ్యాలను పొంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగే వ్రతం ఒకదానిని చెప్పమని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వరలక్ష్మీ వ్రతం ఒకటున్నది అని చెప్పాడు. దానిని శ్రావణమాసంలో రెండో శుక్రవారం ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి… ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఎలా చేయాలో వివరంగా చెప్పమని అర్ధించింది. కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో బంగారు కుడ్యములతో రమణీయంగా అలరారుతోన్న కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో సుగణాలరాశి, వినయ విధేయతలు, భక్తియోగ్యురాలైన చారుమతి అనే ఒక బ్రాహ్మణ మహిళ ఉండేది. రోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామల సేవలో తరిస్తూ జీవిస్తూ ఉండేది. ఒకనాటి రాత్రి చారుమతికి లక్ష్మిదేవి కలలో సాక్షాత్కరించి.. ఓ చారుమతీ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. మేల్కొన్న తర్వాత తనకు వచ్చిన కల గురించి భర్త, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించమని చెప్పారు. చారుమతి కల గురించి విన్న పట్టణంలోని మిగతా మహిళలు సైతం పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూశారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలంతా చారుమతి గృహానికి చేరుకున్నారు. తన గృహంలో మండపం వేసి, కలశం ఏర్పాటు చేసిన చారుమతి.. వరలక్ష్మీదేవి నిసంకల్ప విధులతో ఆహ్వానించిప్రతిష్టించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించింది. అనంతరం మహిళలంతా తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు ఘల్లుఘల్లున శబ్దం మోగింది. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి భర్తలు వచ్చి గజతరగరథ వాహనాలతో ఇళ్లకు తీసుకెళ్లారు. ఇలా, ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని విన్నా, ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయి.