ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో జగన్ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో జగన్ భేటీ

విజయవాడ, ఆగస్టు 19  (way2newstv.com)
మూడు రోజులుగా అమెరికాలో పర్యటిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు. డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆదివారం వాషింగ్టన్‌ డీసీలో ప్రపంచబ్యాంకు సహా వివిధ కంపెనీల ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వాలని వారికి జగన్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్‌కు సహకరించడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్ ఇటీవలే దానిని నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారితో జగన్ చర్చలు ఏమేరకు ఫలించాయే కొంత కాలం వేచిచూడాల్సిందే. 
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో జగన్ భేటీ

చర్చల సారాంశం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోపైపు, రాజధాని నిర్మాణానికి రుణం కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా సహాయాన్ని ప్రపంచ బ్యాంకు జులైలో నిలిపివేసింది. 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయాన్ని ఏపీ ప్రభుత్వం కోరగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ప్రపంచ బ్యాంక్ రుణం కోసం చంద్రబాబు హయాంలో ప్రయత్నాలు ప్రారంభయమ్యాయి. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణం అమరావతి అభివృద్ధి కోసం ( సస్టెయినబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్ స్టిట్యూషనల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పేరుతో) రూ.7200కోట్ల రుణానికి ప్రతిపాదనలు సీఆర్డీయే పంపింది. తొలివిడతగా 3200కోట్లు, రెండో విడతగా మరో 3200కోట్లు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. తర్వాత ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు రెండుసార్లు అమరావతికి వచ్చి పరిశీలించి వెళ్లారు. ఇటు తొలివిడత రుణం తీసుకునేందుకు కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. అయితే, కేంద్ర ప్రభుత్వం సూచనతోనే ఏపీ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం ఉపసంహరించుకున్నట్లు ప్రపంచబ్యాంకు తెలిపింది. రాజధాని మౌలిక వసతులకు ఉద్దేశించిన అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు కోసం రుణం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో విజ్ఞప్తి చేసిందని, కేంద్రం సూచన మేరకు జులై 15న రుణ ప్రతిపాదనను రద్దు చేసుకున్నట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అంతకు ముందు డల్లాస్‌లోని తెలుగువారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. అక్కడ వారు చూపించిన అభిమానానికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన ఆనందాన్ని ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు. తన పట్ల తెలుగువాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు ముగ్ధుడ్ని చేశాయని పేర్కొన్నారు. డల్లాస్ లో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వినమ్రంగా తెలిపారు. తెలుగు వాళ్లలో కనిపించిన ఉత్సాహం, ఉత్సుకత అమోఘం అని జగన్ తన ట్వీట్‌లో వివరించారు. తన పట్ల చూపిన విశేష ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు