స్థానిక ఉద్యోగాల రచ్చే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్థానిక ఉద్యోగాల రచ్చే...

కియాలో లోకల్ పాలిటిక్స్ 
అనంతపురం, ఆగస్టు 10, (way2newstv.com)
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, అధికారంలో ఉండే పార్టీలు శాశ్వతం కాదు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎవరి హయాంలో జరిగినా దానిని కొనసాగించేలా తర్వాత వచ్చే ప్రభుత్వాలు వ్యవహరించాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే పోయేది రాష్ట్ర పరువు తప్ప ఇంకొకటి కాదు. అనంతపురంలో కియా కార్ రోల్ ఔట్ సందర్బంగా అధికార పార్టీ నేతల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధుల ముందు నేతలు స్థాయి మరిచి ప్రవర్తించారు. వారికి తెలుగు రాకపోవడం అదృష్టం.రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచే కియా ప్రాజెక్ట్ అనంతపురం జిల్లా పెనుగొండలో నిర్మించారు. పూర్తిగా రాళ్లు, రప్పలతో నిండి ఉండే కొండల్ని పిండి చేసి వందల ఎకరాల్లో ప్లాంట్ నిర్మించారు. 
స్థానిక ఉద్యోగాల రచ్చే...

ఈ ఏడాది ఫిబ్రవరిలో కియా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత జూలై నాటికి మొదటి కార్ మార్కెట్ లో ప్రవేశ పెడతామని కియా ప్రకటించింది. చెప్పినట్టే జులై 16న కియా కార్ బుకింగ్ ప్రారంభించింది. రికార్డ్ సమయంలో దాదాపు 23వేల కార్లు అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి. జులై 24న ముఖ్యమంత్రి సమక్షంలో తొలి మోడల్ సెల్టోస్ ని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టాలని భావించింది. దేశ, విదేశాల నుంచి మీడియాని ఆహ్వానించిన తర్వాత అనూహ్యంగా ఆ కార్యక్రమం రద్దయింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో దానిని వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగస్ట్ 8కి ముహూర్తం ఖరారు చేశారు. కియా ప్రతినిధులు స్వయంగా ఆహ్వానించడంతో సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. కియా కార్ రోల్ ఔట్ కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. 5వ తేదీన ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన సీఎం జగన్ 6,7 తేదీలలో ఢిల్లీ పర్యటన ఉండటంతో 8న కడప, అనంతపురం లలో పర్యటిస్తానని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో గోదావరి వరదల కారణంగా కియా పర్యటన రద్దు చేసుకున్నారు.చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన ఫ్యాక్టరీకి తాను వెళ్లడం ఏమిటని భావించారో, మరేదైనా కారణం ఉందో కానీ సీఎం స్థానంలో ఆర్థిక మంత్రి బుగ్గన హాజరయ్యారు. ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ప్రసంగంలో కియా యాజమాన్యానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. కియా కోసం 745 ఎకరాల భూమి ఇచ్చామని, మరో 145 ఎకరాలు ఇస్తామని., తమ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హెచ్చరించే ధోరణిలో చెప్పారు. అంతకు ముందు ఎంపీ గోరంట్ల మాధవ్., కియా ఇండియా హెడ్ వినోద్ భట్ తో అనుచితంగా ప్రవర్తించారు. వేదిక మీదే అసహనం వ్యక్తం చేశారు. తనను వేదికపై మాట్లాడేందుకు పిలవలేదని చిర్రుబుర్రులాడారు. అక్కడితో ఆగకుండా తొలి కారు మీద అనుచిత వ్యాఖ్యలు రాశారు. ఆయన వ్యవహార శైలి కియా యాజమాన్యాన్ని విస్తుబోయేలా చేసింది.కియా ప్లాంట్ నుంచి విడుదల చేసిన తొలి కారు మీద ” కియా రోల్డ్ ఔట్ బట్ అవర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ రూల్డ్ ఔట్ అని రాసి సంతకం చేశారు. నిజానికి కియా తొలి కార్ విడుదలలో ఏదొక రచ్చ చేయాలనే అధికార పార్టీ నేతలు వ్యవహరించినట్టు కనిపించింది. ఇప్పటికే కార్ల ప్లాంట్ లో ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టు ల కోసం జీఎం స్థాయి అధికారిని స్థానిక నేతలు బెదిరించడంతో పోలీస్ కేసు నమోదైంది. కియా యాజమాన్యం గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనే భావనలో వైసీపీ నేతలు అనుచితంగా వ్యవహరించారు. దక్షిణ కొరియా రాయబారి., కియా ఎండీల సమక్షంలో రచ్చ చేశారు. మంత్రులు, స్థానిక నేతలు, చోట మోటా నేతలు పెద్ద సంఖ్యలో ప్లాంటులోకి వచ్చేశారు. కారు విడుదల చేసే వేదిక ఎదురుగా వివిఐపి ల కోసం వేసిన కుర్చీలలో వారంతా తిష్ట వేయడంతో విదేశీ ప్రతినిధులు నిలబడిపోయారు. కుర్చీలు ఖాళీ చేయాలని నిర్వాహకులు బతిమాలినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి ప్రసంగంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు ఏపీ లో పెట్టుబడులు పెట్టిన హ్యుందాయ్ అనుబంధ కియా మోటార్స్ కి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రకటించినా అక్కడ పరిణామాలు మాత్రం ప్రభుత్వ, పార్టీ పరువు తీసేలా జరిగాయన్నది మాత్రం స్పష్టం. కియా ప్లాంట్ ఏర్పాటు కోసం దాదాపు 13,500కోట్ల రూపాయలు పెట్టుబడితో రెండేళ్లలో అత్యాధునిక ప్లాంట్ ని దక్షిణ కొరియాకి చెందిన హ్యుందాయ్ సోదర సంస్థ కియా ఏర్పాటు చేసింది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాలతో పోటీపడి ఈ ప్రాజెక్టు ఏపీకి దక్కింది. కియా కార్ల తయారీతో పాటు ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా కొందరు నేతల వ్యవహార శైలితో పెట్టుబడి దారుల్లో సందేహాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. వీటికి మొదట్లోనే అడ్డుకట్ట వేయకుంటే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినడం ఖాయం.