అమర్ కు 2లక్షల జీతం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమర్ కు 2లక్షల జీతం

విజయవాడ, సెప్టెంబర్ 27, (way2newstv.com)
తెలంగాణకు చెందిన జర్నలిస్టు దేవులపల్లి అమర్‌కు జగన్ సర్కారు జాతీయ మీడియా సలహాదారు పదవిని అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు ఇచ్చే జీతభత్యాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నెలకు రూ.2 లక్షల చొప్పున ఆయన జీతం అందుకుంటారని జీవోను బట్టి తెలుస్తోంది. అలవెన్స్, వసతి, వాహన ఖర్చులు కలిపి రూ.3.82 లక్షలను ప్రభుత్వం ఆయన కోసం ఖర్చు చేయనుంది. వ్యక్తిగత సిబ్బంది కోసం ఆయనకు రూ.70 వేలను ప్రభుత్వం చెల్లించనుంది.వాహనానికి నెలకు రూ.60 వేలు, మొబైల్ ఫోన్ బిల్లు కోసం రూ.2 వేలు, అధికారిక క్వార్టర్స్‌లో నివాసం ఉండే అవకాశం లేకపోతే రూ.50 వేల అద్దెను కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. దేశీయ ప్రయాణానికి సెకండ్ క్లాస్ ఏసీ రైలు టికెట్, ఎకానమీ కేటగిరి విమాన టికెట్‌ ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. 
అమర్ కు  2లక్షల జీతం

అంతర్జాతీయ ప్రయాణాలకు బిజినెస్ క్లాస్ టికెట్ చెల్లిస్తుంది. రూ.3.82 లక్షలకు ప్రయాణ ఛార్జీలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ అదనం అన్నమాట.స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అని చెప్పిన జగన్.. తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టుకు ఢిల్లీ కేంద్రం ఉద్యోగం ఇవ్వడం ఏంటి? ఏపీలో జర్నలిస్టులే కనిపించలేదా? అని గతంలోనే విమర్శలొచ్చాయి. దేవులపల్లి అమర్‌కు రూ.3.82 లక్షల జీతం ఇస్తుండటం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే కంటే, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే ఎక్కువ జీతాన్ని సాక్షిలో పని చేసిన జర్నలిస్టుకు ఇస్తున్నారంటూ టీడీపీ అభిమానులు విమర్శిస్తున్నారు.‘‘తప్పుడు రాతలు, తప్పుడు మాటలు చెప్పి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మసి పూసి మారేడు కాయ అని చెప్పి నమ్మించినందుకు గానూ నెలకు జీతం రూ.3,80,000. క్విడ్ ప్రో కో ప్రతి దానిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకునేంత’’ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.సీఎం నెలకు రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నాడని అంటున్నారు. కానీ సీఎంవోలో ఉన్న కేబినెట్ ర్యాంక్ సలహాదారులు, ఓఎస్డీలు, పీఆర్వోల జీతభత్యాలు మాత్రం భారీగా ఉన్నాయని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.