67 మీటర్లు పెరిగిన పాతళగంగ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

67 మీటర్లు పెరిగిన పాతళగంగ

ఒంగోలు, సెప్టెంబర్ 4, (way2newstv.com)
వరుసగా ఐదేళ్లు వర్షాలు సక్రమంగా పడక విలవిల్లాడిన జిల్లా ప్రజానీకానికి ఊరట లభించింది. గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో కరువు కరాళనృత్యం నుంచి వరుణుడు కరుణించటంతో పాతాళ గంగ పైకి ఉబుకుతోంది. నైరుతి రుతుపవనాలు జిల్లాపై చల్లని చూపు చూడటంతో జలకళ ఏర్పడుతోంది. వరుసగా ఐదేళ్లూ  కరువు కోరల్లో చిక్కుకోవటం జిల్లా చరిత్రలోనే లేదు. అయితే జూలై, ఆగస్టు మాసాల్లో వరుసపెట్టి వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. జిల్లాలో 67 మీటర్ల లోతుకు వెళ్లిన గంగమ్మ మెల్లి మెల్లిగా పైకి వస్తోంది. ఈ రెండు నెలల్లో సాధారణ వర్షం కంటే అధికంగా కురవటంతో జిల్లా ప్రజానీకంలో నీటి కొరత ఆశలు తీరుతున్నాయి. ప్రస్తుతం జూలై మాసంలో సాధారణ వర్షం కంటే అధికంగా కురిసింది. దీంతో భూ తాపం తగ్గి భూగర్భ జలమట్టాలు మెల్లి మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి.
జిల్లాలో వర్షపాతం (మిల్లీ మీటర్లలో)
67 మీటర్లు పెరిగిన పాతళగంగ

వర్షపాతం   2015         2016    2017 2018
పడిన వర్షపాతం 668.4 495.0 600.0 326.5
లోటు వర్షపాతం 203.1 376.5 271.5 545.0
ప్రస్తుతం జిల్లాలో సరాసరిన భూగర్భ జలాలు 20 మీటర్లకు చేరుకున్నాయి. అంటే దాదాపు 47 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయన్న మాట. భూ తాపం తగ్గటంతో బావుల్లో, బోరుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. మునుపెన్నడూ లే ని విధంగా 2018 నవంబర్‌ నుంచి 2019 ఫిబ్రవరి 26 వరకు ఒక సారి పరిశీలిస్తే ప్రతి నెలా అర మీటరు మొదలుకొని మీటరు, ఒకటిన్నర మీటరు చొప్పున భూగర్భ జలాలు అడుగంటి పోతూనే వచ్చాయి. భూగర్భ జలం అడుగడుగుకు ఒక నిక్షేపం అంటారు. అంటే పక్కపక్కనే బోరు వేసినా గంగమ్మ ఆనవాళ్లు ఒక్కో చోట ఒక్కో రకంగా కనపడతాయి, ఒక్కో చోట కనకపడవు. ఇక వర్షాలు సంవత్సరాల తరబడి సాధారణ వర్షం కూడా కురవక పోతే పరిస్థితి మరీ దారుణాతి దారుణంగా తయారవుతుంది.అదే పరిస్థితిని ప్రస్తుతం జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్నారు. ఇంతటి దుర్భిక్షం ఏనాడూ చూడలేదన్న వాదన ప్రతి రైతు లోగిళ్లలో నుంచి వస్తున్న మాట. జిల్లాలో ప్రాంతాల వారీగా భూగర్భ జలాల ఆనవాళ్లు ఉంటాయి. ఈ ఏడాది మే మాసం వరకు పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి మరీ అగమ్య గోచరంగా మారింది. కొన్ని గ్రామాల్లో కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా లభ్యంకాని పరిస్థితి నెలకొంది. సాధారణ వర్షపాతం కంటే సగం కూడా వర్షం పడటం లేదు. సరాసరిన సాధారణ వర్షపాతం కంటే 60 శాతం లోటు వర్షపాతంతో జిల్లా అతలాకుతలం అయిపోయింది. కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో అయితే ఇంకా భూగర్భ జలాలు మెరుగు పడాల్సి ఉంది.జిల్లాలోని 12 మండలాల్లో 3 నుంచి 12 మీటర్ల లోతులోని భూగర్భ జలాలు ఉన్నాయి. వాటిలో కారంచేడు 1.69 మీటర్లు, చినగంజాం 4.13 మీటర్లు, కందుకూరు 4.79, సింగరాయకొండ 4.79, చీరాల 4.86, సంతమాగలూరు 4.89, పర్చూరు 4.90, వేటపాలెం 5.34, ఉలవపాడు 5.40, కొత్తపట్నం 6.21, కురిచేడు 6.29, మార్టూరు 7.66, మద్దిపాడు 7.85 మీటర్లలోనే భూగర్భ జలాలు ఉన్నాయి.జిల్లాలోని 24 మండలాల్లో 8 నుంచి 20 మీటర్లలోపు మాత్రమే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నాగులుప్పలపాడు 8.26, ఇంకొల్లు 9.28, జే పంగులూరు 9.28, జరుగుమల్లి, టంగుటూరు 9.60, ఒంగోలు 10.80, యద్దనపూడి 11.61, పొదిలి 12.64, అర్థవీడు 12.70, బల్లి కురవ 14.20, అద్ధంకి 14.36, మర్రిపూడి 14.57, దర్శి 14.74, కనిగిరి 14.81, సంతనూతలపాడు 15.73, ముండ్లమూరు 16.51, త్రిపురాంతకం 16.88, పీసీ పల్లి 17.06, గుడ్లూరు 17.32, లింగసముద్రం 17.35, సీఎస్‌ పురం 17.76, హెచ్‌ఎంపాడు 18.03, కొండపి 18.23, పొన్నలూరు 19.68 మీటర్లు లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. ఇక పోతే 19 మండలాల్లో 20 మీటర్లకు పైబడి భూగర్భ జలాలు లోతులో ఉన్నాయి.