ఆక్వాకు ‘మంచి’ రోజులు(కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆక్వాకు ‘మంచి’ రోజులు(కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, సెప్టెంబర్ 10 (way2newstv.com): 
జిల్లాలోని ఆక్వా రైతుల ఆశలు ఈ ఏడాది ఫలించేలా కన్పిస్తున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలోని అన్ని నదులు, ప్రాజెక్టులు, సరస్సులు, ఏరులు, చెరువులు నీటితో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. నీటినే నమ్ముకుని జీవిస్తున్న డెల్టా రైతుల కళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మంచినీటి లభ్యతపైనే మత్స్యసంపద పెరుగుదల, ఉత్పత్తుల నాణ్యత, ఎగుమతులు ఆధారపడి ఉంటాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువగా నమోదవ్వడం, భారీ ఎత్తున కృష్ణా, గోదావరి నదుల ద్వారా రాష్ట్రానికి చేరడంతో వ్యవసాయ రైతులతో పాటు ఆక్వా సాగుదార్ల కష్టాలు తీరుతున్నాయి. ఒడుదొడుకుల ఆక్వా రంగంలో ఈ ఏడాది సిరుల పంట ఖాయమని భావిస్తున్నారు. 
ఆక్వాకు ‘మంచి’ రోజులు(కృష్ణాజిల్లా)

చేపల పెరుగుదలకు జీవనాధారం నీరు. అయిదేళ్లుగా రాష్ట్రంలో సరైన వర్షపాతం నమోదవ్వకపోవడంతో చేపల పరిశ్రమ తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. రెండేళ్ల నుంచి కనీసం చేపల చెరువుల్లో పిల్లలను బతికించుకునేందుకు నీరివ్వని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. రాష్ట్ర ఆక్వారంగానికి తలమానికంగా ఉన్న కృష్ణా జిల్లాలోని చేపల రైతులు నానా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రూ.లక్షల్లో లీజులు చెల్లించి చెరువులను నెలల తరబడి ఖాళీగా ఉంచుకున్నారు. కొత్తగా తవ్విన చెరువుల సంగతి చెప్పనవసరం లేదు. చెరువులను తవ్వి ఆరు నెలలు నీటికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న చెరువుల్లో మంచినీటి లభ్యత లేకపోవడంతో ఉప్పుశాతం విపరీతంగా పెరిగిపోయింది. పెద్ద చేపలలో పెరుగుదల నిలిచిపోయింది, చిన్న చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువుల్లో చేపలను రక్షించుకునేందుకు రైతులు పూర్తిగా మందులపైనే ఆధారపడాల్సి వచ్చింది. రూ.లక్షల్లో మందులకు ఖర్చుచేసి చేపల ప్రాణాలను నిలిపేందుకు ప్రయత్నించారు. సాగు ఖర్చులు పెరిగిపోవడంతో పాటు పెరుగుదల లేక రైతులు కోట్లల్లో నష్టాలను చవిచూడక తప్పలేదు. ఆర్థికంగా ఎంతో పరిపుష్టతలను సాధించిన జిల్లాలోని ఆక్వా రైతులు ఎక్కడ లేని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చేపల చెరువుల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినా కనీసం వడ్డీఖర్చులు రాని పరిస్థితి నెలకొంది. చాలామంది రైతులు ఉప్పునీటి రొయ్యల సాగు వైపు పరుగులు పెట్టి అక్కడ చేతులు కాల్చుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. ప్రస్తుతం నీరు అందుబాటులో ఉండడంతో చేపల పెంపకం ద్వారా నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఆశల సాగుపై దృష్టిని సారిస్తున్నారు.ఐదేళ్ల తర్వాత జిల్లాలోని ఆక్వారంగానికి పుష్కలంగా నీరు లభించడంతో కోటి ఆశలతో రైతులు సిరుల పంటకు సిద్ధమవుతున్నారు. కొల్లేరుతో పాటు రైవస్‌, ఏలూరు, పోల్‌రాజ్‌ కాలువ, క్యాంబెల్‌, బందరు కాలువ తదితర అన్ని డ్రెయిన్లు, పిల్ల కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. నాలుగేళ్లుగా వరుస నష్టాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రైతులు వీటిని భర్తీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోనే సుమారు 1.8 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏటా మన జిల్లా నుంచే 11 లక్షల టన్నుల ఉత్పత్తులను ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇప్పటికే లక్ష్యం కంటే ఎక్కువ శాతం వృద్ధిరేటును ఆక్వారంగం సాధించింది. ప్రస్తుతం 12 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని ఆక్వాపరిశ్రమ ముందుకు సాగుతోంది. మంచినీరు అందుబాటులోకి రావడంతో చెరువుల్లో ఉప్పు శాతం తగ్గి పెరుగుదలకు అనువుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచినీటి లభ్యత వల్ల చేపల్లో వచ్చే వ్యాధులు, వైరస్‌లు తగ్గి రైతులకు సాగుఖర్చులు తగ్గుతాయి. ఆక్వారైతులు ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలత వైపు అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. ఈ ఏడాది ఆక్వారంగం మరింత వృద్ధిరేటు సాధించే అవకాశముంది. జిల్లాలో ఉప్పునీటి రొయ్యల సాగు చేపల చెరువుల పాలిట శాపంగా మారింది. మంచినీటి లభ్యత లేకపోవడం రొయ్యల చెరువుల్లో ఉప్పునీటిని ఇష్టారాజ్యంగా మంచినీటి కాలువల్లోకి విడుదల చేయడంతో జిల్లాలోని చేపల రైతులకు పక్కలో బల్లెంలా ఉప్పు సమస్య దాపురించింది. గడచిన అయిదేళ్లుగా జిల్లాలో ఉప్పునీటి రొయ్యల సాగు విపరీతంగా వృద్ధి చెందింది. దీంతో చేపలకు పెద్ద ఎత్తున కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రతి మంచి, మురుగు డ్రెయిన్లలో పెద్ద ఎత్తున రొయ్యల చెరువుల్లోని నీటిని వదిలేయడం వల్ల ఉప్పు పేరుకు పోయింది. దీనివల్ల కూస్తో కాస్తో వచ్చిన మంచినీరు ఉప్పుగా మారిపోవడంతో చేపల సాగు ప్రమాదంలో పడింది. ప్రస్తుతం వచ్చిన నీటితో కాలువల్లో, చెరువుల్లో, కొల్లేరులో పేరుకుపోయిన ఉప్పు దిగువకు పోయి మంచినీరే ప్రస్తుతం ఉంది. దీనివల్ల మరో ఎనిమిది నెలల వరకు ఉప్పు సమస్య తలెత్తకుండా ఉంటుంది.