నెల్లూరు, సెప్టెంబర్ 5, (way2newstv.com)
రాజకీయాలు రకరకాలు. కొందరు ప్రజల కోసం.. మరికొందరు తమ కోసం.. ఇది ఒకప్పుడు మనకు కనిపించింది. ఉన్నది కూడా వదులుకుని ప్రజల కోసం సేవ చేసిన పుచ్చలపల్లి వంటివారిని నేడు మనం కోరుకుంటే.. చాలా దురాశ.. దుస్సాహసమే అవుతుంది. పోనీ.. పావలా అంతైనా ప్రజలకు సేవ చేయరా ? అంటే.. పావలా కాదుకానీ.. పది పైసలతో సరిపెట్టుకోమనే వారు ఉన్నారు. ఇక, అది కూడా మేం చేయలేమనే వారు కూడా ఉన్నారంటే.. అతిశయోక్తి కాదు. నిజానికి రాజకీయాల్లో నాయకుడు అంటే.. గతంలో ఉన్న నిర్వచనం ప్రకారం ప్రజల్లోంచి ప్రజల కోసం పుట్టుకు వచ్చేవాడే నాయకుడు.కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. డబ్బులోంచి డబ్బుకోసం పుట్టుకు వచ్చేవాడే నాయకుడు అన్న చందంగా రాజకీయాలకు కొత్త అర్ధం చెబుతున్నారు నాయకులు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు.
ఊసరవెల్లితో పోటీ పడుతున్న నేతలు
మన రాష్ట్రం విషయానికి వస్తే.. ఓ ఇద్దరు ఎంపీలు అచ్చు.. కాంట్రాక్టులు, సంపాదన కోసమే రాజకీయాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. వారే పేరెన్నికగన్న.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి. నిన్న మొన్నటివరకు అంటే ఎన్నికలకు ముందు వరకు వీరు టీడీపీలో ఉన్నారు. మరి దీనికి ముందు మాగుంట ఫ్యామిలీ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ముందు టీడీపీ ఆ తర్వాత కాంగ్రెస్… 2014 ఎన్నికలకు ముందు టీడీపీకి జంప్… ఈ ఎన్నికలకు ముందు వైసీపీకి జంప్…ఇలా ఆయన వరుసగా పార్టీలు మారుతూనే వచ్చారు.అయితే, పైన వీరు ప్రజాసేవ కోసం కాదు. స్వసేవ కోసం రాజకీయాలు చేశారు. లిక్కర్‌డాన్‌గా పేరు తెచ్చుకున్న మాగుంట ఫ్యామిలీలో అన్న వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు శ్రీనివాసులరెడ్డి. అధికారం ఎటుంటే.. వీరు కూడా అటే ఉంటారు. ఈ క్రమంలోనే విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి ఈయన టీడీపీలో చేరిపోయారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆవెంటనే కాంట్రాక్టులు.. ఎమ్మెల్సీ పదవిని సొంతం చేసుకున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అటు ఎమ్మెల్సీ పదవితో పాటు బాబు ఇచ్చిన కోట్లాది రూపాయల కాంట్రాక్టులతో తన పబ్బం గడుపుకున్నారు.ఇక, తాజా ఎన్నికలకు ముందు వైసీపీ పిలుపుతో ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకుని ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఆ వెంటనే ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి కాంట్రాక్టుల కోసం వెంపర్లాడుతున్నారు. ఇక, ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఈ కోవలోని నాయకుడే. బేసిక్‌గా ఈయన కూడా కాంట్రాక్టరే. దీంతో టీడీపీలో ఉండగా అటు ప్రజాప్రతినిధిగా.. ఇటు కాంట్రాక్టులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈయన నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు. ఎన్నికలకు ముందు టీడీపీ తరఫున టికెట్ ఖరారైన తర్వాత వైసీపీలో చేరిపోయారు.వీరిద్దరూ ఏనాడూ.. ప్రజాసమస్యలపై పట్టించుకున్నదీ లేదు. జిల్లా సమస్యలపై దృష్టి పెట్టింది అంతకంటే లేదు., వీరికన్నా ముందు నెల్లూరు, ఒంగోలు ఎంపీలుగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఒకింత ప్రజల్లో తిరిగారు. కానీ, ఆదాల, మాగుంటలు మాత్రం తమకోసం రాజకీయ బాట వేసుకుని తాము మాత్రమే డెవలప్ అవుతున్నారు. దీంతో వీరిని నమ్మి రాజకీయంగా ఓటేసిన ప్రజలు నష్టపోతున్నారు.
Tags:
Andrapradeshnews