ఏలూరు, సెప్టెంబర్ 11, (way2newstv.com)
జిల్లాలో కొన్ని చోట్ల డెంగ్యూ సోకినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పరీక్షల పూర్తి వివరాలు అందుబాటులోకి రాకపోయినా ఆయా వ్యక్తుల వద్ద బయటపడుతున్న లక్షణాలు బట్టి డెంగ్యూగానే వైద్యులు భావిస్తున్నారు. పెదపాడు మండలం కొత్తూరు, వీరవాసరం, నల్లజర్ల మండలం అనంతపల్లి, మొగల్తూరు తదితర ప్రాంతాల్లో డెంగ్యూ లక్షణాలతో పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఎక్కడికక్కడ వైద్యాధికారులను అలర్ట్ చేసింది. మొత్తం మీద గత కొంతకాలంగా అక్కడక్కడ డెంగ్యూ లక్షణాలతో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నా తాజా పరిణామాల్లో మాత్రం జిల్లాలో డెంగ్యూ పంజా వేసినట్లు స్పష్టమవుతోంది.
భయపెడుతున్న డెంగ్యూ జ్వరాలు
జిల్లా యంత్రాంగం పారిశుద్ధ్య పరిస్థితిపై ఎట్టకేలకు దృష్టి పెట్టింది. అన్ని ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య పరిస్థితులను తక్షణం మెరుగుపర్చాలంటూ ఆదేశాలుజారీ చేసింది. దీనితో అన్ని ప్రాంతాల్లోనూ స్పెషల్ డ్రైవ్ మాదిరిగా పారిశుద్ధ్య కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంలో పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. పంచాయితీ అధికారులు, కార్యదర్శులు, ఇవో ఆర్‌డిలకు తగు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం కారణంగా ఈ వ్యాధులు ప్రబలినట్లు తేలితే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి లక్షణాలు వున్నట్లు ప్రచారం జరగడంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరోసారి మండల, గ్రామస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా స్పందించి తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఎక్కడైతే డెంగ్యూ ప్రబలినట్లు సమాచారం అందిందో ఆ ప్రాంతాల్లో వైద్యాధికారులు పర్యటించి ముందస్తు శాంపిల్స్‌ను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో అపరిశుభ్రత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దీన్ని మెరుగుపర్చేందుకు పంచాయితీ కార్యదర్శులు, ఇవో ఆర్‌డిలు సరైన రీతిలో వ్యవహరించడం లేదన్న అంశం ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాల్లో వెల్లడి కావడంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు కూడాడెంగ్యూ వ్యాధి లక్షణాలు ప్రబలుతున్నట్లు సమాచారం అందుతున్న నేపధ్యంలో ఇప్పటికైనా పంచాయితీ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా వుంది.