ఒంగోలు, సెప్టెంబర్ 19, (way2newstv.com)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందా? తెలుగుదేశం పార్టీ నేతలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయిందా? ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా,రా? అంటే అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ సమాచారం అందింది.స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమయినట్లే కన్పిస్తుంది. అయితే ఎమ్మెల్యేల ఇష్టంతోనే పార్టీలో చేరికలు ఉండాలని వైఎస్ జగన్ షరతు పెట్టినట్లు తెలిసింది.
ఆమంచి చక్రం తిప్పుతున్నారే...
బలమైన నాయకుల విషయంలో మాత్రం ఎమ్మెల్యేలు ఒకింత రాజీపడాల్సి ఉంటుందని, వారు పార్టీలోకి వచ్చి చేరినా ఎమ్మెల్యేల ప్రాధాన్యత తగ్గదని వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంకేతాలు పంపుతున్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకుంది. అయితే డిసెంబరులో స్థానిక సంస్థలు ఉండటంతో టీడీపీ లో ఉన్న బలమైన నేతలతో పాటు, ద్వితీయ శ్రేణినేతలను పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ జగన్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు విశాఖకు చెందిన ఆడారి ఆనంద్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పార్టీలో చేరిపోయారు. ఇక మరికొందరు వైఎస్ జగన్ సమక్షంలో చేరేందుకు రెడీగా ఉన్నారు.తోట త్రిమూర్తులు పార్టీలో చేరే సమయంలో ఆయనంటే గిట్టని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణలతో జగన్ విడివిడిగా సమావేశమయ్యారు. తోట త్రిమూర్తులను పార్టీలోకి ఎందుకు తీసుకోవాల్సి వస్తుందో వివరించారు. తోట చేరిక పార్టీలో విభేదాలు తలెత్తకూడదని వైఎస్ జగన్ ముందుగానే ముఖ్యమైన నేతలతో మాట్లాడారు. ఇదే విధానాన్ని మిగిలిన నేతల విషయంలో అమలుపర్చనున్నారు. ఆమంచి కృష్ణమోహన్ చెప్పినట్లు త్వరలోనే వైసీపీలో చేరికలు మరింత ఉండే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వైసీపీలోకి వచ్చేందుకు అనేకమంది టీడీపీ నేతలు సుముఖంగా ఉన్నారని, జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని ఆమంచి కృష్ణమోహన్ చెప్పిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో ఏపీలో టీడీపీ ఖాళీ అవుతుందని కూడా ఆమంచి జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచే ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు.