ఏపీని భయపెడుతున్న ఆర్ధిక పరిస్థితి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీని భయపెడుతున్న ఆర్ధిక పరిస్థితి

విజయవాడ, సెప్టెంబర్ 17,(way2newstv.com)
బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడమే వైఎస్ జగన్ కి ఇపుడు తలనొప్పిగా మారిందా అనిపిస్తోంది. మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకున్న వైఎస్ జగన్ ని జనం ఎంతలా ఆదరించారో అర్ధమైంది. దాంతో వైఎస్ జగన్ కూడా తన బాధ్యతలను గుర్తు చేసుకుని ఇచ్చిన హామీలను పక్కాగా అమలుచేయాలని నిర్ణయించుకున్నారు. వంద రోజుల్లో ఒక్కో హామీని అమలు చేసేలా అధికార‌ యంత్రాంగాన్ని సమాయత్తపరుస్తున్నారు. వైఎస్ జగన్ అనుకుంటున్నట్లుగా హమీలు తీర్చాల్సిందే. మరి దానికి డబ్బులు కావాలి. అవి ఎక్కడ నుంచి వస్తాయి. ఏపీ బడ్జెట్ చూస్తే దారుణంగా ఉంది.
ఏపీని భయపెడుతున్న ఆర్ధిక పరిస్థితి

ఓ వైపు ఆర్ధిక మాంద్యం అంటున్నారు. మరో వైపు కేంద్ర సాయం పెద్దగా లేదు. ఏపీలో వచ్చిన ఆదాయనికి కూడా దశలవారీ మద్యపాన నిషేధం పేరిట వైఎస్ జగన్ కన్నాలు వేసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరో మూడు నెలల తరువాత వైఎస్ జగన్ సీన్ ఏంటి అన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది.నీతి అయోగ్ కమిటీ ఏపీలో పర్యటించింది. వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఆ తరువాత అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్ అంకితభావాన్ని మెచ్చుకుంటూనే ఏపీ ఆర్ధిక పరిస్థితిపై భయపెట్టే వాఖ్యలు కొన్ని చేశారు. ఏపీలో అనుత్పాదక వ్యయం బడ్జెట్లో దారుణగా పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఏపీ అర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా అనేశారు. ఇలాగైతే కష్టమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అనుత్పాదక వ్యయం తగ్గించుకోవాలని వైఎస్ జగన్ కు గట్టి సలహా ఇచ్చి వెళ్ళారు. అంతే కాదు, పెట్టుబడులను పెంచుకోవాలని, వీలైతే పబ్లిక్ బాండ్లు, ఇతర సాధనాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చెప్పుకొచ్చారు. మొత్తానికి యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని మాత్రం భయపెట్టేశారనే చెప్పాలి.ఇక మరో వైపు ఏపీకి చెందిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ఏపీలో ఆర్ధిక పరిస్థితి దారుణమని చెప్పేశారు. వైఎస్ జగన్ చేతులెత్తేశారని కూడా ఆయన అనడం విశేషం. మరి ఆర్ధిక ఇబ్బందులు ఉంటే వైఎస్ జగన్ మాత్రం ఏం చేస్తారని సానుభూతి చూపని బీజేపీ పెద్దాయన అదే తాము కోరుకుంటున్నట్లుగా స్టేట్ మెంట్ వదిలారు. కేంద్రంలోని బీజేపీ నిధులు ఇవ్వదు. వైఎస్ జగన్ ఏమో తన బడ్జెట్లో 64 వేల కోట్ల కేంద్ర సాయం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అది కూడా పన్నుల ద్వారా కాకుండా ఉదారంగా సాయంగా ఆయన లెక్కలేసుకున్నారు. మరో వైపు నీతి అయోగ్ వైస్ చైర్మన్ నిధుల సంగతి హామీ ఇవ్వకుండా నీతులు మాత్రం చెప్పివెళ్లారు. ఈ నేపధ్యంలో సంక్షేమ క్యాలండర్ ని ముందుంచుకున్న వైఎస్ జగన్ సర్కార్ వచ్చే నెల రైతు భరోసా నుంచి కధ మొదలెట్టాల్సిఉంది. ఖాళీ ఖజానా నేపధ్యంలో ఏపీలో సీన్ మారుతుందా, వైఎస్ జగన్ కష్టాల్లో పడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.