గ్రామాల్లో కాన రాని పారిశుద్ధ్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామాల్లో కాన రాని పారిశుద్ధ్యం

అనంతపురం, సెప్టెంబర్ 11, (way2newstv.com)
అనంతపురం జిల్లా వ్యాప్తంగా మెజార్టీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధం పడకేసింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రధాన రహదారుల్ని శుభ్రం చేస్తున్నా, ఆ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో దిక్కూదివాణం లేకుండా పోయింది. కొన్ని చోట్ల మేజర్ పంచాయతీల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్లు చెత్తాచెదారంతో నిండిపోయి ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మైనర్ పంచాయతీల్లో రోడ్లు ఊడ్చే వారే లేకుండా పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు తమ ఇళ్ల ముందు శుభ్రం చేసుకుని ఆ చెత్తను రోడ్లపైకి తెచ్చి పడేస్తున్నారు.
 గ్రామాల్లో కాన రాని పారిశుద్ధ్యం

గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలనకు తెర పడిన తరుణంలో పంచాయతీల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లాలో మొత్తం 1003 గ్రామ పంచాయతీలుండగా, వాటిలో ఎంపిక చేసిన వాటి పర్యవేక్షణకు 556 మందిని నియమించారు. ముఖ్యంగా ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఎం ఈఓలు తదితరులను ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నియమించారు.  ఇంకా కొన్ని చోట్ల పాలిథిన్ కవర్లలో చుట్టి విసిరేస్తున్నారు. దీంతో రోడ్లతో పాటు పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, దుకాణాలు, నివాసాల వద్దకు గాలికి కొట్టుకు వచ్చి పేరుకుపోతోంది. ఇటీవల నార్పల మండల కేంద్రంలో ప్రధాన రహదారి చెత్తాచెదారంతో నిండిపోయి గాలికి అటూ ఇటూ ఎగిరి పోతూ వాహనదారులు, పాదచారులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల సహనానికి పరీక్ష పెట్టాయి. ఈ పరిస్థితి చెత్తదిబ్బల మధ్య సహవాసం చేసిన రీతిని తలపించడం విశేషం. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని చాలా చోట్ల తరచూ చోటుచేసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్ల మధ్యే చెత్తదిబ్బలు పేరుకు పోతున్నా, పాఠశాలల సమీపంలోనూ చెత్తాచెదారం నిల్వ ఉంచుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. పారిశుధ్య కార్మికుల సంఖ్య కూడా చాలా పంచాయతీల్లో తక్కువగా ఉండటం కూడా అపరిశుభ్రత తాండవించడానికి కారణమవుతోంది. ప్రస్తుత సీజన్‌లో వాతావరణ మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియాతో పాటు ప్రాణాంతకమైన డెంగీ ప్రబలుతున్నాయి. చిన్నారులు జ్వరాల బారిన పడి అల్లాడుతున్నారు. అనంతపురం, నగరం, ఇతర పట్టణాల్లో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. అనంతపురంలోని చిన్ని పిల్లల ఆస్పత్రులకు జిల్లా నలుమూలల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొస్తున్నారు. దోమల బెడద, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా దగ్గు, జలుబుతో పిల్లలు, పెద్దలు జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యంపై తగిన శ్రద్ధ చూపక పోయినా, ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించక పోయినా రోగాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులున్న పంచాయతీల్లో ప్రధాన వీధులే కాకుండా గ్రామ వీధులు కూడా శుభ్రంగా ఉంచితేనే స్వచ్ఛ భారత్‌కు అర్థం ఉంటుంది. జనం రోగాల బారిన పడేందుకు ఆస్కారం లేకుండా పరిస్థితి అదుపులో ఉంటుంది. అధికారిక గణాంకాల మేరకు జిల్లాలోని 63 మండలాలకు గానూ 40 పైబడి మండలాల పరిధిలోని 54 పంచాయతీల్లో 423 మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరిద్దరే ఉంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పని చేయాల్సి ఉన్నా పనిభారంతో కొందరు బద్ధకిస్తున్నారు. పెద్దవడుగూరు, సీకేపల్లిలో ఒక్కొక్కరు చొప్పున, తమ్మిడేపల్లి, రొళ్ల, పాలసముద్రం, నల్లమాడ, కదిరి రూరల్, గాండ్లపెంట పంచాయతీల్లో ఇద్దరు చొప్పున మాత్రమే  స్వీపర్లు ఉన్నారు. కక్కలపల్లి, అగళి, బాలేసముద్రం, బుక్కపట్నం, తూముకుంటలో ముగ్గురేసి, తలుపుల, రొద్దం, కుమ్మరవాండ్లపల్లి, గుడిబండ, డీ.హీరేహాళ్, రాచానపల్లి, ఆకుతోట పల్లిలో నలుగురు చొప్పున పని చేస్తున్నారు.