మహానగరానికి ముందడుగు (విజయవాడ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహానగరానికి ముందడుగు (విజయవాడ)

విజయవాడ, సెప్టెంబర్ 17(way2newstv.com): 
విజయవాడను మహా నగరంగా మార్చే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికల కోడ్‌కు ముందే మూలపడిన దస్త్రాన్ని అధికారులు కదిలిస్తున్నారు. ఏళ్ల తరబడి కలగానే మిగిలిన గ్రేటర్‌ విజయవాడ కార్పొరేషన్‌ ప్రతిపాదనపై చర్చించేందుకు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సమావేశం ఏర్పాటు కానుంది. దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో విజయవాడ ఒకటి. నవ్యాంధ్ర రాజధాని నేపథ్యంలో నగరాన్ని మెట్రో స్థాయిలో మార్చడానికి 45 పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. విజయవాడ అర్బన్‌ మండలంతో పాటు, గ్రామీణ మండలం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, కంకిపాడు, గన్నవరం మండలాలు ఉన్నాయి. గతంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 
మహానగరానికి ముందడుగు (విజయవాడ)

ఆర్థిక పరిపుష్టి సాధించిన పంచాయతీలు విలీనాన్ని వ్యతిరేకించగా.. అభివృద్ధి అంతగా లేని గ్రామాలను నగరంలో కలిపేందుకు అప్పటి సర్పంచులు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు గ్రామ పాలన లేకపోవడంతో అధికారులు గ్రేటర్‌ విజయవాడ దిశగా అడుగులు వేస్తున్నారు. మహానగరంలో భాగంగా విజయవాడలో కలిసే గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు వీఎంసీ కమిషనర్‌ నోటీసులు పంపించారు. ఆయా గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి, జనాభా, మౌలిక సదుపాయాలు వంటి తదితర వివరాలతో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. దీంతో గ్రేటర్‌ ఆశలు మళ్లీ చిగురించాయి. గతంలో విజయవాడ మహానగరపాలక సంస్థగా ఆవిర్భంచేందుకు మూడు ప్రతిపాదనలు చేశారు. దీంతో డివిజనల్‌ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సంబంధిత వివరాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీనిపై వీఎంసీ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ అధ్యక్షతన త్వరలోనే సమావేశం జరగనుంది.విజయవాడ నగరం ప్రస్తుతం విస్తీర్ణం 61.88 చ.కి.మీ కాగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.39 లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే విస్తరించిన విజయవాడలో శివారు పంచాయతీలు సైతం కలిసిపోయాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రమం ఏర్పాటు, కంకిపాడులో పలు విద్యా సంస్థలు రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటు, ఇబ్రహీపంట్నం పారిశ్రామికీకరణ, పెనమలూరు అర్బన్‌ వాతావరణం సంతరించుకున్నాయి. చుట్టుపక్కల 45 గ్రామాలను కలిపితే.. విస్తీర్ణం 425.59 చ.కిమీలకు పెరిగింది. జనాభా దాదాపు 15.17 లక్షలకు చేరుతోంది. వీటిలో 19 గ్రామ పంచాయతీలు మాత్రమే విలీనానికి సుముఖత వ్యక్తం చేశారు. మిగతా వారంతా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నగరపాలక సంస్థలో కలపడం వల్ల కలిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విలీన గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ప్రణాళికను సూచించాలని డిమాండ్‌ చేశారు.